Friday, October 4, 2024

Tirumala – దేవుళ్ల‌ను రాజ‌కీయాల‌లోకి లాగ‌కండి…. సుప్రీం కోర్టు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వివాదంపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని హితవుపలికింది. లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీని జస్టిస్ బి ఆర్ గవాయ్, జస్టిస్ కేవీ వి బాలకృష్ణన్ ధర్మాసనం ప్రశ్నించింది.

తిరుమల స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఆరోపణలు నేపథ్యంలో ఈ అంశంలో నిజం నిగ్గూ తేల్చాలంటూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై సుప్రీంకోర్టులో నేడు విచార‌ణ జ‌రిపింది.

- Advertisement -

కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారని సుప్రీంకోర్ట్ నిలదీసింది. ఈ అంశంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించిన అనంతరం కల్తీ నెయ్యిపై మీడియా ముందు ప్రకటన చేయడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా నియమించిన సిట్ సరిగ్గా విచారణ జరపగలదా? అన్న సందేహాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది.

స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించినట్లు ఎలా తెలిసిందంటూ సుప్రీంకోర్ట్ సందేహం వ్యక్తం చేసింది. అలాగే స్వామి వారి ప్రసాదం లడ్డూని పరీక్షల కోసం ల్యాబ్‌కి ఎప్పుడు పంపారని ముకుల్ రోహాత్గిని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపితే బావుంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిష‌న‌ర్ల తరుపున సీనియర్ న్యాయవాది రాజశేఖర్ రావు త‌న వాద‌న‌లు వినిపించారు. అనంతరం ఈ కేసు విచారణను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ బాలకృష్ణన్ ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement