Friday, April 26, 2024

Tirumala – ఇక‌పై సిఫార్స్ లేఖ‌ల‌పై ద‌ర్శ‌నాల‌కు నో

తిరుమల, ప్రభన్యూస్‌: తిరుమలలో జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆది వారాలలో సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, సుప్రభాత సేవలను రద్దు చేస్తు న్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపా రు. తిరుమలలోని అన్నమయ్య భవనం లో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో విలేకరులతో మాట్లాడుతూ, ఘాట్‌రోడ్లలో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేశామని, మహారాష్ట్రలోని నవీ ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 600 కోట్ల రూపాయలు విలువచేసే స్థలాన్ని టిటిడికి మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని, రూ. 100 కోట్ల వ్యయంతో రేమాండ్స్‌ అధినేత సింఘానియా ఆలయాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారన్నారు. అలాగే టీటీడీ పద్మావతి హృదయాలయంలో ఇప్పటి వరకు 1450 మంది చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించామని, అదేవిధంగా వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్ధం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో సేవలందిస్తున్నాయని ఇందుకోసం జూలై 15 వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి బ్రేక్‌ దర్శనాలను ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశామన్నారు.

అలాగే టీటీడీ చరిత్రలో తొలిసారి టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు స్వచ్చందంగా నెలరోజుల పాటు సుందర తిరుమల- శుద్ధ తిరుమల కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. అదేవిధంగా తిరుమల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు రాష్ట్ర హోం శాఖ ప్రధాన కార్యదర్శి హరీష్‌కుమార్‌ గుప్తా ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులు తిరుమలలో రెండు రోజుల పాటు భద్రతాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించారని, తద్వారా భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఇక ముఖ్యంగా టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది వ్యక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని, ఇలాంటి వ్యక్తుల మీద ఐటి విభాగం ఇప్పటికే పోలీసులకు పిర్యాదు చెెశారని, నిరుద్యోగులు ఇలాంటి ప్రకటనలు నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.

మేలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 110 కోట్లు
మే నెలలో 23.38 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా హుండీ ద్వారా రూ.109.99 కోట్లు ఆదాయం వచ్చిందని , విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 1కోటి 6 లక్షలు, అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 56.30 లక్షలు, తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 11 లక్షలుగా నమోదు అయ్యాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్‌వో నరసింహకిషోర్‌, ఎస్‌విబిసి సిఈవో షణ్ముఖ్‌కుమార్‌, చీఫ్‌ ఇంజనీర్‌ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement