Wednesday, April 24, 2024

వామ్మో పెద్దపులి.. భయాందోళనలో స్థానికులు, ప్రయాణీకులు..

అన్నమయ్య ప్రతినిధి, ప్రభ న్యూస్‌: జనాల్లో పెద్దపులి భయం నెలకొంది. ఇటీవల వరుసగా పెద్దపులి సంచరించిన అంటూ స్థానికులు, ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో గువ్వలచెరువు ఘాట్‌ రోడ్డు ప్రయాణీకులు, హార్సిలీహిల్స్‌ ఘాట్‌ రోడ్డులో ప్రయాణించాలంటే పర్యాటకులు భయాందోలనకు గురవుతున్నారు. రామాపురం మండలం గువ్వలచెరువు ఘాట్‌లోని కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిలో చిరుతపులి కనిపించిందని కొందరు ప్రయాణీకులు గత కొంతకాలం క్రితం వీడియోల ద్వారా సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తున్నారు. 4 రోజుల క్రితం మదనపల్లి సమీపంలోని హార్సిలీహిల్స్‌ ఘాట్‌రోడ్డులో చిరుతపులి రోడ్డు దాటిందని కొందరు పర్యాటకులు వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టారు. ఇది నిజమా లేదా అబద్దమా అనుకునే లోపే శుక్రవారం రాత్రి రామసముద్రం మండలం దాసర్లపల్లెలో రైతుకు చెందిన పాడి ఆవును పులి పక్కనే ఉన్న పొలాల్లోకి లాక్కెళ్లి చంపి కొంత భాగం తినిందని గ్రామస్తులు అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలంలో పెద్ద పెద్ద పులి అడుగుజాడలు ఉండటంతో పాటు పాడి ఆవు మెడపై, గొంతుపై పెద్ద గాట్లు ఉన్నాయి. సుమారు పాడి ఆవు శరీరాన్ని పాతిక భాగం వరకు కొరికి తిన్న ఆనవాల్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది చూసిన గ్రామస్తులు ఇది కచ్చితంగా చిరుతపులి అని నిర్ధారిస్తున్నారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. అలాగే లక్కిరెడ్డిపల్లె మండలంలోని పుట్టకారవాండ్లపల్లె సమీపంలోని పొలాలలో గురువారం చిరుత సంచరించిందని, ముందు రోజు సురభి పాయలోపల్లెకు చెందిన పోగుల చిన్నయ్య అనే వ్యక్తిపై దాడి చేసిందని బాధితుడు చెబుతున్నాడు. దీంతో చుట్టు గ్రామస్తులు చిరుత ఎక్కడ సంచరిస్తోందోనని భయాందోళనకు గురవుతున్నారు. ఏది ఏమైనా ఇలా రహదారుల పైన, పంట పొలాల్లో చిరుత సంచరిస్తున్నదన్న అనుమానం ప్రజల్లో నెలకొనడం వల్ల వారు గ్రామాల్లో బిక్కుబిక్కుమంటూ బతుకున్నారు. మరోవైపు గువ్వలచెరువు ఘాట్‌ రోడ్డు, హార్సిలీహిల్స్‌ ఘాట్‌ రోడ్డులో ప్రయాణించాలంటే ప్రయాణీకులు భయపడుతున్నారు.

లక్కిరెడ్డిపల్లె మండల పరిధిలోని పుట్టకారవాండ్లపల్లె పొలాలలో సంచరించింది పులి అని ఇంకా నిర్ధారణ కాలేదు. అక్కడ సంచరించిన జంతువు ఏంటని కనుగొనేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా పెట్టాము. ఇంత వరకు మేము అమర్చిన సీసీ కెమెరాలలో చిరుతపులి కనిపించలేదు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనవసరంగా ఇతరులు చెప్పే మాటలు నమ్మి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మురళీకృష్ణ, పారెస్ట్‌ రేంజ్‌ ఆఫీస్‌, రాయచోటి

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement