Wednesday, April 24, 2024

ఆ పని చేస్తూ దొరికిపోయారు.. పోలీసులు ఏం చేశారంటే..


అమరావతి, ప్ర‌భ‌న్యూస్: రాష్ట్రంలో గంజాయి కట్టడికి చేపట్టిన ఆపరేషన్‌ పరివర్తన్‌ సత్ఫలితాలిస్తోంది. ఇందులో భాగంగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు పోలీసుల సహకారంతో ప్రత్యేక దాడులు నిర్వహిస్తూ గంజాయి రవాణా, సాగుపై ఉక్కుపాదం మోపుతున్నారు. గత నెల రోజులుగా విశాఖ ఏజెన్సీలో ఆపరేషన్‌ పరివర్తనలో భాగంగా గంజాయి మొక్కల నరికివేత కార్యక్రమాన్ని చేపట్టారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కౌన్సిలింగ్‌ నేపధ్యంలో కొందరు మొక్కలను తామే స్వచ్ఛందంగా ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.105 కోట్లకు పైగా గంజాయి మొక్కలను అధికారులు ధ్వంసం చేశారు. అధికారులు దాడులు, తనిఖీలు పెరిగిన నేపధ్యంలో ఇప్పటి వరకు సాగు చేసి ఎండబెట్టిన గంజాయిని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలించి తదనంతరం ఇతర రాష్ట్రాలకు తరలించాలనేది స్మగ్లర్ల వ్యూహం.

దీనిని ముందుగానే పసిగట్టిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. విశాఖపట్టణం రూరల్‌ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌.సతీష్‌ కుమార్‌ ఆదేశాల మేరకు వి.మాడుగుల ఎస్‌ఈబీ ఇన్‌స్పెక్టర్‌ సింహాద్రి సిబ్బందితో కలిసి చీదికాడ మండలంలోని కోణం గ్రామ సమీపంలో వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న ఓ వాహనంపై అనుమానం రావడంతో ఆపి తనిఖీలు చేశారు. ఆ వాహనంలో మూడు వేల 402 కిలోల గంజాయిని గుర్తించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఒక్కొక్క ప్యాకెట్‌లో 10.5 కిలోల చొప్పున ప్యాక్‌ చేసిన స్మగ్లర్లు నాలుగు ప్యాకెట్లను ఒక బ్యాగులో పెట్టారు. ఈ విధంగా 81 బ్యాగుల్లో గంజాయిని రవాణా చేస్తున్నందుకు విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం బంగారుమెట్ట గ్రామానికి చెందిన లారీ యజ మాని పర్రె శ్రీను, వాడధి గ్రామానికి చెందిన వాహన డ్రైవర్‌ నాళం ఈశ్వరరావును అరెస్టు చేసి వాహనం స్వాధీనం చేసుకున్నట్లు సెబ్‌ జేడీ సతీష్‌ కుమార్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement