Friday, March 29, 2024

వీరు రారు.. వారు అడగరు..

వైద్యం కోసం పేద, మధ్య తరగతి ప్రజలు ఎవ్వరూ ఇబ్బంది పడకుండా అందరికీ నాణ్యమైన వైద్యం అందించాలన్న సంకల్పంతో వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు సమూలంగా మార్చి పేదవాడికి కూడా కార్పొరేట్‌ వైద్య సేవలు అందించేందుకు వీలుగా నాడు – నేడు పథకం కింద ఆసుపత్రుల ఆధునీకరణ పనులను పెద్ద ఎత్తున చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ విలేజ్‌ క్లీనిక్‌లు, అర్బ‌న్ హెల్త్‌ క్లీనిక్‌లు, ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్ల ద్వారా మెరుగైన వైద్యసేవలను పేదలకు అందించే విధంగా ప్రభుత్వం కృషిచేస్తుంది. అయితే ఈ ఆసుపత్రులలో పనిచేసే కొంతమంది వైద్యులు ప్రభుత్వం ద్వారా వేలకు వేలు జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తూ పేదలకు వైద్యం అందించకుండా దొంగాట ఆడుతున్నారు.

నాయుడుపేట డివిజన్‌ పరిధిలో ఉన్న ప్రభుత్వ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్‌ క్లీనిక్‌లు, అర్బ‌న్‌ హెల్త్‌ సెంటర్లను ఆదివారం ఏకంగా మూసివేస్తున్నారు. దీంతో వైద్యం కోసం వచ్చే పలువురు రోగులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఓజిలి మండలం అత్తివరం ప్రభుత్వ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం మూసివేసి తలుపులు కూడా తెరవక పోవడంతో అక్కడి ప్రజలు వైద్యులు, సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుండి శనివారం వరకు ఆసుపత్రిని తెరిచి ఉంచుతున్న వైద్యులు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు రారో తెలియదని ఆదివారం అయితే ఏకంగా ఆసుపత్రిని మూసివేసి ఇళ్ల వద్దే ఉండిపోతున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పీహెచ్‌సీ పరిధిలో అత్తివరం గ్రామంతో పాటు కారూరు, ద్వారాకాపురం, పెరిమిడి గ్రామం నుండి సైతం రోగులు వైద్య చికిత్సల కోసం వస్తుంటారు.

వీరితోపాటు అత్తివరం సమీపంలో పలు పరిశ్రమలు ఉండడంతో వందలాది మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. నాయుడుపేట – వెంకటగిరి ఆర్‌ అండ్‌బీ రహదారికి ఈ ఆసుపత్రి సమీపంలో ఉండడంతో రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారు అత్యవసర చికిత్సల కోసం ఇక్కడికి వస్తుంటారు. వైద్యసేవలకు ఇంతటి ప్రాధాన్యత ఇక్కడ ఉన్నప్పటికీ అరకొరగా వైద్యసేవలు అందిస్తూ వైద్యులు, సిబ్బంది చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇకపోతే ఇందే మండలంలోని వజ్జవారిపాళెం ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఓ వైద్యురాలు ఆసుపత్రికి రాకుండానే నెల్లూరులో ఉంటూ నెలనెల జీతం అందుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఆసుపత్రిని ఆదివారం రోజు మూసివేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నాయుడుపేట మండలం గొట్టిప్రోలు ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం కూడా తరచూ మూసివేస్తున్నట్లు చెబుతున్నారు. పెళ్లకూరు, దొరవారిసత్రం, సూళ్లూరుపేట, తడ మండలాల పరిధిలోని పలు పీహెచ్‌సీలలో ఇదే పరిస్థితి నెలకొని ఉంది.

కేంద్ర బృందానికి సోకులు చూపించి
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలన చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ నేషనల్‌ క్వాలిటీ అసిస్‌మెంట్‌ స్టాండెడ్‌ కమిటీ బృందం జిల్లాకు విచ్చేసింది. వీరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను పరిశీలన చేశారు. ఆసుపత్రులలో నాణ్యత ప్రమాణాలను పరిశీలించి అక్కడ అందుతున్న సేవలను గుర్తించారు. కేంద్ర బృందం ఆసుపత్రులను సందర్శిస్తుందని తెలుసుకుని ఆసుపత్రులకు సోకులు చేసి తళుక్కుమన్నట్లుగా చూపించారు. అంతా కార్పొరేట్‌ స్థాయిలో సదుపాయాలు ఉన్నట్లుగా వారిని నమ్మించారు. ఆ బృందం వెళ్లిపోయిన తర్వాత ఆసుపత్రుల వైపు కొంతమంది వైద్యులు కన్నెత్తి కూడా చూడడం లేదు.

కోవిడ్‌ పరీక్షలు, వ్యాక్సినేషన్‌ జోరుగా సాగించాల్సిన సమయంలో
కరోనా పరీక్షలను చేసి ఆ నమూనాలను ల్యాబ్‌కు పంపే ప్రక్రియ అంతా మాయగా మారింది. ఎక్కడా పరీక్షలు నిర్వహస్తున్న దాఖలాలు లేవు. ఇళ్లల్లో కూర్చుని పరీక్షలు నిర్వహించకుండానే నిర్వహించినట్లుగా ఉన్నతాధికారులకు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని ఉన్నతాధికారులు పదేపదే చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులకు ఏకంగా తాళాలు వేసి విధులకు డుమ్మా కొట్టడంపై ప్రభుత్వ సేవలపై వీరికి ఎంతటి బాధ్యత ఉందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.

- Advertisement -

సీజనల్‌ వ్యాధులు ప్రభలుతూ వ్యాధుల బారిన జనం
ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రభలుతున్నాయి. మలేరియా, డెంగ్యూ, వ్యాధులతో పాటు విషజ్వరాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వారికి ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యసేవలను అందించే విధంగా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాల్సి ఉంది. అయితే ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య ఉపకేంద్రాలు, అర్బ‌న్‌ హెల్త్‌ సెంటర్లలో అరకొరగా సేవలు అందిస్తుండడం వల్ల వ్యాధుల బారిన పడుతున్న జనం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించక తప్పడం లేదు.

ఆదివారం ఆసుపత్రికి రారు – శంకరయ్య, అత్తివరం
ఆదివారం ఆసుపత్రి తలుపులు కూడా తెరవరు. మిగిలిన రోజుల్లో డాక్టర్‌ ఎప్పుడొస్తారో తెలియదు. అత్తివరం ప్రభుత్వ ఆసుపత్రికి నాలుగు గ్రామాల వారు వైద్యం కోసం వస్తారు. ఇక్కడ ఆదివారం ఆసుపత్రిని మూసివేయడంతో వెంకటగిరి, నాయుడుపేటకు వెళ్లి ప్రైవేటు ఆసుపత్రులలో చూపించుకోవాల్సి వస్తోంది. వరి సీజన్‌ కావడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఇక్కడకు వచ్చి పనిచేసుకుంటున్నారు. వారు కూడా వైద్యం కోసం అగచాట్లు పడుతున్నారు. ఆదివారం ఆసుపత్రి మూయకుండా వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement