Thursday, April 25, 2024

మూడు రాజధానులపై వెనక్కి తగ్గేదే లేదు.. ఢిల్లీలో మంత్రి బొత్స సత్యనారాయణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు (పాలన వికేంద్రీకరణ) విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ఆ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం సుప్రీంకోర్టులో జరిగిన వాదనలపై స్పందిస్తూ.. నాడు తాము చెప్పిందే ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యల రూపంలో చెబుతోందని అన్నారు. పాలనావ్యవస్థ, శాసన వ్యవస్థ అధికారాల్లోకి హైకోర్టు ప్రవేశిస్తోందని తాము గతంలో చెప్పినప్పుడు తప్పుబట్టారని, కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం చేసిన వ్యాఖ్యల్లో తమ అభిప్రాయంతో ఏకీభవించిందని గుర్తుచేశారు.

ఆ రోజు హైకోర్టులైనా, ఈరోజు సుప్రీంకోర్టులోనైనా తాము ఒకటే చెబుతూ వచ్చామని ఆయనన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని నిర్ణయించే అధికారం లేదనడం హాస్యాస్పదమని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమని, దానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. కొత్త రాజధానిలో కార్యాకలాపాలను ప్రారంభించేందుకు వచ్చే ఏడాది వరకు ఆగాల్సిన అవసరం లేదని, రేపంటే రేపు కూడా మొదలుపెట్టొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. న్యాయం తమవైపు ఉందని, అంతిమంగా కోర్టు తీర్పు తమకే అనుకూలంగా ఉంటుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు.

మరోవైపు రైతులతో చేసుకున్న ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించిన అంశాన్ని గుర్తుచేయగా.. ఆ ఒప్పందాలకు తాము కట్టుబడి ఉన్నామని కోర్టులో, బయటా చెబుతూనే ఉన్నామని బొత్స అన్నారు. నిజానికి గతంలో చేసుకున్న ఒప్పందాలకు మించి ప్రయోజనాలు అందించేలా యాన్యుటీని పెంచామని గుర్తుచేశారు. రైతులతో చేసుకున్న ఒప్పందంలో ‘రాజధాని అభివృద్ధి’ అన్న పదమే లేదని, రైతుల నుంచి సేకరించిన ‘భూముల అభివృద్ధి’ అని మాత్రమే ఉందని బొత్స స్పష్టం చేశారు. భూముల అభివృద్ధితో పాటు ఒప్పందంలో ప్రతి అంశానికి తాము కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.

- Advertisement -

ఆ ప్రకారమే నడుచుకుంటున్నామని తెలిపారు. ఇకపోతే ఒప్పందాలు కుదుర్చుకున్నవారిలో కొద్ది మంది మినహా అసలు రైతులు ఎవరూ లేరని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. అసలు రైతుల నుంచి భూములను దళారులు, బాబు బినామీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎప్పుడో కొనుక్కుని ఒప్పందాల ద్వారా భారీగా ప్రయోజనం పొందేందుకు స్కెచ్ వేశారని బొత్స అన్నారు. వారే ఇప్పుడు రైతుల ముసుగు వేసుకుని అమరావతి ఉద్యమం అంటున్నారని బొత్స సూత్రీకరించారు.

ఇకపోతే నెల రోజుల్లోగా తాగునీరు, డ్రైనేజి, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్న అంశంపై స్పందిస్తూ ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకు కల్పించలేకపోయారో చెప్పాలని అన్నారు. ఆయన హయాంలో నిర్మించిన తాత్కాలిక భవనాల వెనుక ఉద్దేశం కూడా వేరని, 125 అడుగుల లోతు పునాదులు తవ్వి చదరపు అడుగుకు రూ. 11 వేలు ఖర్చు పెట్టి తాత్కాలిక భవనాలను నిర్మించారని, ఆ క్రమంలో భారీగా అవినీతి చోటుచేసుకుందని బొత్స ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement