Thursday, April 25, 2024

చెట్లు నరికేసి, అక్రమంగా అమ్మేసి.. ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తున్న విద్యాశాఖ

నాయుడుపేట, (ప్రభన్యూస్‌): వాతావరణం సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జగనన్న పచ్చతోరణం వనమహోత్సవం పేరుతో సాక్ష్యాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతీయ అటవీ విధానానికి అనుగుణంగా 33శాతం పచ్చదనాన్ని పెంపొందిస్తూ ఆకుపచ్చిన ఆంధ్రావని సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని సీఎం జగన్‌ పిలుపునిచ్చారు. మొక్కలు నాటే కార్యక్రమం ఓ యజ్ఞంలా చేపట్టాలని కూడా తెలియజేశారు. ఇంతగా చెట్ల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఆరాట పడుతుంటే కొందరు ఆ చెట్లను నరికివేసి సొమ్ములు చేసుకుంటున్నారు. అదికూడా ప్రభుత్వ పాఠశాలల్లోని చెట్లను సైతం నరికివేస్తూ అక్రమంగా అమ్మేస్తుండడంతో పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాయుడుపేట మున్సిపాలిటీలోని మండల విద్యాశాఖ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో ఏళ్ల క్రితం ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటారు. అవి పెరిగి మహావృక్షాలుగా మారాయి. ఆ పాఠశాలలో విధులు నిర్వర్తించే ప్రధానోపాధ్యాయులు ఎలాంటి ప్రకటన లేకుండానే చెట్లను నరికివేయించారు. పాఠశాల ఆవరణంలో ఉన్న ఆ మహావృక్షం పక్కనే మరో చెట్టు కూడా ఉంది. అయినా నరికివేయబడినటువంటి చెట్టు అడ్డంగా ఉందని, పిల్లలపై పడుతుందేమోనని సాకులు చెప్పి ఇలా అక్రమంగా నరికివేయించడం పలు విమర్శలకు తావిస్తోంది. ఆ చెట్టు ఎండనూ లేదు.. వేర్లు బయటకు రానులేదు. ఆరోగ్య వంతంగా ఉన్న ఈ చెట్టును కోతకు గురిచేసి నేలకు ఒరిగేలా చేసేశారు. అతి పెద్ద చెట్టుమొద్దులను ట్రాక్టర్‌లకు లోడ్‌చేసి అమ్మేసుకున్నారు.

గతంలో జిల్లా పరిషత్‌ హైస్కూల్లో ఇదే తరహాలో చెట్లు నరికివేత..

నాయుడుపేట పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో గత ఏడాది నాడు – నేడు పేరుతో ఆ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు ఎలాంటి వేలం ప్రకటన లేకుండా పదుల సంఖ్యలో ఉన్న వృక్షాలను నరికి వేయించి అక్రమంగా అమ్మివేశారు. ఆ సొమ్ము ప్రభుత్వ ఖాతాలో జమచేయకుండా అప్పణంగా మింగేశారన్న విమర్శలు ఉన్నాయి. జిల్లా పరిషత్‌ హైస్కూల్లో ఇలా అక్రమంగా చెట్లు నరికివేస్తే విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో ప్రస్తుతం ఎంఈఓ కార్యాలయానికి వెనుక భాగంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని మహావృక్షాన్ని ఇలా నిబంధనలకు విరుద్దంగా నరికివేసి ఆ చెట్టు మొద్దులను అమ్మివేయడం జరిగిందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఎంపీడీఓకు చెప్పారంటా.. వారు నరికేసుకున్నారు – ఎంఈఓ బాబు..

ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో ఉన్న చెట్టు ఎండిపోయి పిల్లల మీద పడిపోతుందని హెచ్‌ఎం చెప్పారు. పేరెంట్స్‌ కమిటీ మీటింగ్‌ పెట్టుకుని నిర్ణయం తీసుకోమని చెప్పా. చెట్టు నరికివేసిన విషయం తెలియదు. ఇప్పుడే చెబుతా. ఎంపీడీఓకు చెప్పారంటా వారు నరికేసుకున్నారు. వేలం ప్రకటన లేకుండా ఎలా చేశారన్న దానికి సమాధానం లేదు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..,

Advertisement

తాజా వార్తలు

Advertisement