Monday, April 15, 2024

Delhi | కర్నాటకతో మార్గం మూసుకుపోలేదు.. తెలంగాణతో కొత్త మార్గం తెరుస్తాం: జీవీఎల్‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ప్రభావం ఇతర రాష్ట్రాలపై ఉండదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు, రాజ్యసభలో బీజేపీ దక్షిణాది రాష్ట్రాల విప్ జీవీఎల్ నరసింహా రావు అన్నారు. కర్ణాటక ఫలితాలు బీజేపీకి అనుకూలంగా లేనప్పటికీ ప్రజల్లో మాత్రం వ్యతిరేకత లేదని చెప్పడానికి ఓట్ల శాతమే నిదర్శనమని అన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 36% ఓట్లు సాధించగా ఈసారి కూడా దాదాపుగా అంతే వచ్చిందని తెలిపారు. జేడీ(ఎస్) 2018లో 18 శాతానికి పైగా ఓట్లు సాధించగా, ఈసారి 12 శాతానికే పరిమితమైందని, ఆ పార్టీ కోల్పోయిన ఓట్లు కాంగ్రెస్‌కు అదనంగా కలిసొచ్చాయని విశ్లేషించారు.

ఏదేమైనా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం 2024 సార్వత్రిక ఎన్నికలపై ఉండదని, ప్రజలు దేశానికి మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలో 28 స్థానాలు పూర్తిగా బీజేపీయే గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైనప్పటికీ.. ఆ వెంటనే కొద్ది నెలల వ్యవధిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక సీట్లు బీజేపీయే గెలుపొందిందని, రాజస్థాన్‌లో క్లీన్ స్వీప్ చేసిందని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్థానికాంశాలు ప్రభావితం చేస్తాయని ఆయన తెలిపారు.

కర్ణాటక అసెంబ్లీ ఫలితాల ప్రభావం పక్కనే ఉన్న తెలంగాణపై కూడా ఏమాత్రం ఉండదని జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఇంకా చెప్పాలంటే కర్ణాటక ఓటమితో దక్షిణ భారత దేశంలో బీజేపీ కోల్పోయిన ద్వారాన్ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ద్వారా తెరుస్తామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement