Friday, March 29, 2024

విద్యుత్‌ వాహనాలకు ‘లైఫ్‌’ షాక్‌.. భారీగా పెరగనున్న విద్యుత్‌ బైకుల రేట్లు

అమరావతి, ఆంధ్రప్రభ: విద్యుత్‌ వాహనాలదారులపై పన్ను పోటు పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం జీవితకాల పన్ను 12శాతం విధిస్తూ రాష్ట్ర రవాణాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని భారీగా తగ్గిస్తతే..మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ రవాణా వాహనాలపై 12శాతం జీవితకాలపు పన్ను విధించడంతో..విద్యుత్‌ వాహనాల రేట్లు భారీగా పెరగనున్నాయి. ప్రభుత్వాల నిర్ణయంతో విద్యుత్‌ వాహనాల కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉన్నట్లు డీలర్లు చెపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా రూ.లక్షల రూపాయలుండే విద్యుత్‌ బైక్‌పై 40శాతం సబ్సిడీ ఇస్తోంది. దీనిని 25శాతం తగ్గించి ఇకపై 15శాతం మాత్రమే ఇవ్వనుంది.

ప్రభుత్వ నిర్ణయంతో రూ.60వేలకు దొరికే విద్యుత్‌ వాహనం..ఇకపై రూ.85వేల అవుతుందని చెపుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం విధించే 12శాతం జీవిత పన్ను కలిపితే రూ.97వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇవి కాక నంబరు ప్లేటు, అదనపు ఫిట్టింగ్స్‌తో కలిపి రూ.లక్ష వరకు విద్యుత్‌ వాహనంపై పడుతుందని డీలర్లు చెపుతున్నారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన వినియోగం తగ్గించే చర్యల్లో భాగంగా 2018 నుంచి కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ ప్రకటించింది.

ఎఫ్‌ఎంఈ-2 (ఫాస్టర్‌ అడాప్షన్‌ ఆఫ్‌ మ్యానుఫ్యాక్షరింగ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ఇన్‌ ఇండియా) పథకంలో భాగంగా 40శాతం వరకు రాయితీ సౌకర్యం ఇవ్వడంతో దేశవ్యాప్తంగా విద్యుత్‌ ద్విచక్ర వాహనాలు, బస్సులు, ఆటోలు, క్యాబుల కొనుగోళ్లు పెరిగాయి. ఐదేళ్ల కాల పరిమితి ముగియడంతో జూన్‌ 1 నుంచి రాయితీని 25శాతం తగ్గించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఓలా, టీవీఎస్‌ వంటి సంస్థలకు చెందిన ప్రముఖ మోడల్‌ వాహనాల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

- Advertisement -

అమలులోకి జీవితకాలపు పన్ను..

రాష్ట్రంలో వివిధ రకాల విద్యుత్‌ వాహనాలు 60వేల వరకు ఉన్నాయి. ఇకపై కొత్తగా కొనుగోలు చేసే విద్యుత్‌ వాహనాలపై జీవిత పన్ను వసూలు చేసేందుకు జిల్లాస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత వారం రోజులుగా ఆయా వాహనాలు రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఇచ్చిన రవాణాశాఖ..గురువారం నుంచి 12శాతం జీవిత పన్ను విధించింది. ఆటో, టాక్సీ, బస్సులకైతే త్రైమాసిక పన్నులు వసూలు చేయాలంటూ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రూ.లక్ష విలువైన బైకుపై రూ.12వేలు జీవిత పన్నుగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెపుతున్నారు. ఇప్పటికే ఏపీఎస్‌ ఆర్టీసీ పెద్ద ఎత్తున విద్యుత్‌ బస్సుల కొనుగోలుకు టెండర్లు కూడా పిలిచింది. ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు.

15శాతం సబ్సిడీ ఇచ్చినా భారమే..

రాష్ట్రంలో వివిధ సంస్థలు ఉత్పత్తి చేస్తున్న పలు విద్యుత్‌ స్కూటర్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఇందులో ఓలా ఎస్‌-1 ప్రో రూ.లక్షా 33వేలు ఉంది. 15శాతం సబ్సిడీ ఇస్తే రూ.16,650 వరకు తగ్గుతుంది. తద్వారా వినియోగదారులు రూ.లక్ష 16వేల 350కి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే వాస్తవ రేటుపై మాత్రమే జీవిత కాలపు పన్ను చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. వాహనం కొనుగోలుకు రూ.15,960 కలుపుకుంటే మొత్తంగా రూ.లక్షా 32వేల 310 చెల్లించాల్సి ఉంటుంది. నంబరు ప్లేటు, ఇతర అదనపు ఫిట్టింగ్స్‌ చార్జీలు కలుపుకుంటే వాహనం రోడ్డెక్కేందుకు రూ.లక్షా 33వేలకు పైమాటే.

విద్యుత్‌ బైకుల్లో ఎథన్‌ 450 ఎక్స్‌ రేటు రూ.1.37లక్షలు, టీవీఎస్‌ ఐక్యూబ్‌ రేటు రూ.లక్షా 61వేలు ఉండగా, చార్జర్లకు తయారీ సంస్థలు అదనపు బిల్లులు వేయడంతో విద్యుత్‌ స్కూటర్ల రేట్లు మరింత భారం కానున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చితే పెట్రోలు రేట్లు ఏపీలో అధికంగా ఉన్నట్లు వాహనదారులు ఎప్పటి నుంచో చెపుతున్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్‌ బైకులు కొనుగోలు చేయాలన్న వాహనదారులకు ప్రభుత్వ నిర్ణయం ఆశనిపాతంగా చెప్పొచ్చు. తద్వారా విద్యుత్‌ వాహనాల కొనుగోళ్లపై వినియోగదారుల ఆసక్తి తగ్గే అవకాశాలు ఉన్నట్లు డీలర్లు చెపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement