Monday, October 14, 2024

మొక్కజొన్నకు మొక్కుబడి ధర.. రైతుల్లో ఆవేదన

గుంటూరు, (ప్రభన్యూస్‌ బ్యూరో): మొక్కజొన్నకు మొక్కుబడి ధర లభిస్తుండడంతో సాగుచేసిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రబీ సీజన్లో ఈసారి అత్యధికంగా సాగైన మొక్కజొన్న పంట చేతికి వస్తున్న వేళ ధరలు వేగంగా పతనమవుతున్నాయి. దిగుబడులు ఇంటికి వచ్చి విక్రయానికి సిద్ధమైన తరుణంలో ధరలు తగ్గడంతో సాగుదారులు ఆందోళన చెందుతున్నారు. మార్చి నెలలో క్వింటా రూ.2200 ధర పలకగా, ప్రస్తుతం క్వింటా రూ.1700కు కొనుగోలుదారులు అడుగుతున్నారు.

ఈ ధరకు అమ్ముకోలేక పెద్ద రైతులు శీతల గోదాముల్లో నిల్వ చేస్తుండగా కొందరు వేచిచూసే ధోరణి అవలంభిస్తుండగా, సన్న, చిన్నకారు రైతులు గత్యంతరం లేక వ్యాపారులు చెప్పిన ధరకు తెగనమ్ముకుంటున్నారు. కోత, నూర్పిడికి వెంటనే సొమ్ము చెల్లించాల్సి రావడంతో చేతిలో సొమ్ము లేనివారు పొలంలోనే విక్రయించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరిచి మద్దతు ధరకు కొనాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

వరి తర్వాత మొక్కజొన్నసాగు..

- Advertisement -

మొక్కజొన్న క్వింటా రూ.2500 ధర చూసిన రైతులు ఇప్పుడు క్వింటా రూ.1700కు అమ్ముకోవడానికి కొందరు ఆసక్తి చూపడం లేదు. సమీపంలో శీతల గోదాములు అందుబాటు-లో ఉన్నవారు నిల్వ చేయడానికి మొగ్గుచూపుతున్నారు. ఈఏడాది శీతల గోదాముల్లో మిర్చి నిల్వ చేసే పరిస్థితులు తక్కువగా ఉండటంతో మొక్కజొన్నలు నిల్వ చేసుకోవడానికి శీతల గోదాముల యజమానులు తక్కువ ధరకే అనుమతి ఇస్తున్నారు. క్వింటాకు రూ.80 చొప్పున అద్దె తీసుకుంటున్నారు. ఇది కర్షకులకు కలిసివస్తుండటంతో నిల్వ చేస్తున్నారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మిర్చి, పత్తి సాగుతో నష్టపోయిన రైతులు మొక్కజొన్న సాగు చేపట్టారు.

గతేడాది అక్టోబరు నెలలో మొక్కజొన్న క్వింటా ధర రూ.2500 ఉంది. సింహభాగం కర్షకులు రబీ సీజన్లో మొక్కజొన్న సాగుకు మొగ్గుచూపారు. పెదనందిపాడు, పర్చూరు, మార్టూరు, శావల్యాపురం, వినుకొండ, నరసరావుపేట, ఈపూరు తదితర ప్రాంతాల్లోనూ విస్తారంగా సాగు చేశారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో వరి తర్వాత మెజారిటీ- రైతులు మొక్కజొన్న సాగు చేశారు. గతంలో సాగు చేయని ప్రాంతంలో ఈ పంటను సాగు చేయడంతో విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. కొత్తగా సాగు చేసిన ప్రాంతాల్లో దిగుబడులు కూడా ఎకరాకు సగటు-న 40 క్వింటాళ్ల వరకు వచ్చాయి. ఇప్పటికే సాగు చేస్తున్న ప్రాంతాల్లో ఎకరాకు సగటు-న 30-35 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు మొక్కజొన్న సాగుకు పెట్టు-బడులు సైతం పెంచారు. ఎకరాకు రూ.35 వేల వరకు ఖర్చయింది. క్వింటా రూ.2500కు విక్రయిస్తే లాభాలు బాగుంటాయని రైతులందరూ ఆశించారు. గతేడాది అక్టోబరు నుంచి క్రమంగా ధరలు పతనమై ప్రస్తుతం క్వింటా రూ.1700కు కొనుగోలు చేస్తుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తిరోగమనంలో ధరలు..

కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాకు రూ.1962 కనీస మద్దతు ధర ప్రకటించగా ప్రస్తుతం రైతులకు ఆ ధర కూడా లభించని పరిస్థితి నెలకొంది. గత అక్టోబరు నెలలో మొక్కజొన్న క్వింటా రూ.2500 ధర పలకగా కర్ణాటక రాష్ట్రంలో పంట చేతికి వచ్చిన తర్వాత క్రమంగా ధరలు పతనమవుతూ వచ్చాయి. మార్కెట్లో సరకు లభ్యత పెరుగుతుండటంతో ధరలు మరింత తగ్గాయి. గుంటూరు కంటే ముందుగా కర్నూలు జిల్లాలో రావడంతో ధరలు క్వింటా రూ.2 వేలలోపునకు వచ్చాయి. పల్నాడు ప్రాంతంలో గత 15 రోజుల నుంచి ముమ్మరంగా నూర్పిడులు జరుగుతుండగా డెల్టాలో ఏప్రిల్‌ నెల తొలివారం నుంచి మొదలయ్యాయి. మార్చి నెలలో రూ.2200 ఉన్న ధర క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం రూ.1700కు దిగజారింది. మార్కెట్లో సరకు లభ్యత ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు ఆచితూచి కొనుగోళ్లు చేస్తున్నారు.

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి : రైతు సంఘం నాయకులు..

జొన్న, మొక్కజొన్న పంటలు కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జొన్నా శివశంకర్‌ డిమాండ్‌ చేశారు. మొక్కజొన్న సాగుచేసిన రేవేంద్రపాడు, శృంగారపురం పెదపాలెం పేరుకలపూడి మోరంపూడి గ్రామాల్లో పర్యటించి రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలు కావడం లేదని జొన్న రూ.2900 ధర ఉంటే రూ.2200కి,మొక్కజొన్న రూ1960లు ఉండగా కేవలం రూ 1700 – 1650 లకి అమ్ముకున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. పంటలకు గిట్టు బాటు ధర లేక పోవడంతో రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జొన్న, మొక్కజొన్న పంటలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్పందించకపోతే రైతుల్ని సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement