Saturday, October 5, 2024

AP: 2029లో రాష్ట్రంలో అధికారం మాదే… షర్మిల

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : 2029లో రాష్ట్రంలో అధికారం త‌మ‌దేన‌ని ఏపీసీసీ చీఫ్ ష‌ర్మిల అన్నారు. బీజేపీతో బాబు, పవన్ లు సక్రమ పొత్తు పెట్టుకుంటే జగన్ అక్రమ పొత్తు పెట్టుకుని, మోడీకి గులాం గిరి చేస్తున్నారని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం తాపత్రయ పడుతున్న వీరికి ప్రత్యామ్నాయం కేవలం కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. 2029లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిన ఆమె ఇప్పటివరకు ఆటుపోట్లు ఎదుర్కొన్న ఇక అద్భుతాలు చేద్దామంటూ పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో మరింత బలపడి రాజకీయంగా ఎదగాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. విజయవాడలోని ఓ ఫంక్షన్ హాల్ లో గురువారం ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, ఏపీసీసీ చీఫ్ షర్మిల అధ్యక్షతన రాష్ట్ర నూతన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ… తాను రాజకీయాల్లో అడుగు పెడతానని ఏ రోజు అనుకోలేదని, కానీ పరిస్థితులు ఈ రోజుకి తీసుకొచ్చాయన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆనాడు వైయస్ రెడ్డి కాంగ్రెస్ ను విలీనం చేసి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయ్యార‌ని, తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశానన్నారు. తాను ఏ పదవి ఆశించకుండా పార్టీలోకి వచ్చానని చెప్పారు. ఏపీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సి ఉందన్న ఆమె త‌న అవసరం ఇక్కడే ఉందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలని వైఎస్ఆర్ కోరిక అన్నారు. ఈ దేశానికి రాహుల్ ప్రధాని అవ్వాల్సిన అవసరం ఉందని, తనకు ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక లేదని, రాహుల్ ప్రధాని అవ్వాలి.. అదే త‌న లక్ష్యమ‌న్నారు. రాహుల్ ప్రధాని అయితేనే ఏపీకి హోదాతో విభజన సమస్యలన్నీనెరవేరతాయన్నారు.

మన ముందు ఉన్న అత్యంత పెద్ద లక్ష్యాన్ని చేరుకునేందుకు కాంగ్రెస్ పార్టీలోని ప్రతి నేత పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ 5 ఏళ్లలో ఎన్నో అద్భుతాలు చేయొచ్చని, పార్టీని బలోపేతం చేసి రాజకీయంగా ఎదగాలన్నారు. బూత్ లెవల్ నుంచి పార్టీ పునర్ నిర్మాణం జరగాలని, ప్రతి బూత్ కి 20మంది కార్యకర్తలు ఉండాలన్నారు. బూత్ లెవల్ కార్యకర్తలు ఉంటే ఒక పెద్ద ఫోర్స్ తయారవుతుందన్నారు. పాత, కొత్త నాయకులను అందరినీ కలుపుకొని వెళ్ళాలని చెప్పారు. ఇప్పుడున్న వైసీపీ క్యాడర్.. ఒకప్పుడు కాంగ్రెస్ క్యాడర్ అని తెలిపారు. మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్ మీద ఉన్న వ్యతిరేకత చంద్రబాబుకి ఓట్లు పడ్డాయని, బాబు మీద ఉన్న వ్యతిరేకత జగన్ కి పడ్డాయన్నారు.

- Advertisement -

చంద్రబాబు వద్దు అనుకున్న వాళ్ళ ఓట్ల శాతం 38శాతం ఉందన్నారు. అన్ని పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా చూసుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు మనం ఛాలెంజ్ గా తీసుకోవాలని, కాంగ్రెస్ చాలా చోట్ల సీట్లు గెలవాలన్నారు. ఏపీలో కాంగ్రెస్ గెలుపుపై అధిష్ఠానం సైతం ఫోకస్ పెట్టిందని, జాతీయ స్థాయిలో నాయకులు రాష్ట్రానికి వస్తారన్నారు. అక్టోబర్ 2న‌ గాంధీ జయంతి రోజున బీజేపీ చేసిన అన్యాయంపై నిరసన చేపడదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిడుగు రుద్రరాజు, మాజీ కేంద్రమంత్రి పల్లం రాజు, రఘువీరారెడ్డి, తులసి రెడ్డి, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావుతో పాటు పెద్ద ఎత్తున నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement