Friday, March 29, 2024

Big Story | వలపు వల, చిక్కితే గిలగిల.. కొంపముంచిన ఫోన్‌ ముచ్చట్లు

గుంటూరు, ప్రభన్యూస్‌ బ్యూరో: ప్రేమ, పెళ్లి, స్నేహం ముసుగులో మాయగాళ్లే కాదు.. కిలేడీలు వలపు వల విసురుతున్నారు. తమ మాటలు నమ్మి దగ్గరైన వారి బలహీనతలను అవకాశం చేసుకుని సొమ్ము చేసుకుంటు-న్నారు. ముందుగా మేసేజ్‌లతో ముగ్గులోకి దించుతారు. ఆ తర్వాత పర్సనల్‌ వివరాలు అడుగి అందినకాడికి దోచుకుంటున్నారు. ఒంటరి మగవాన్ని చూసి వలపు వల విసురుతారు. వారి మాయలో పడితే పరువుపోవడంతో పాటు, ఉన్నదంతా పోగొట్టుకొని బజారున పడడమే.

తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు గ్రామీణ ప్రాంతంలో ఈ తరహా అనుభవం ఓ వృద్ధుడికి ఎదురైంది. మీరు చాలా అందంగా ఉన్నారు. చాలా మంచి వారులా కనిస్తున్నారు. నా భర్త తాగి వచ్చి కొడుతున్నాడు. అతని బాధలు భరించలేకున్నా. ఆయనకు విడాకులిచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానంటూ ఓ వృద్ధుడికి వలపు వల విసిరి నిలువ దోపిడీ చేసిన వైనంపై బాధితుడు గుంటూరు పోలీసు కార్యాలయంలో ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. పొన్నూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి అక్కడ బైక్‌ మెకానిగ్గా పని చేస్తున్నాడు. అతని భార్య ఎనిమిదేళ్ల కిందట మృతి చెందింది. ఈ క్రమంలో ఓ వివాహిత అతని సెల్‌ ఫోన్‌ నంబర్‌ సేకరించి మాటలతో మాయచేసింది.

మాటలతో మెస్మరైజ్‌..

- Advertisement -

తన ద్విచక్ర వాహనం మకమ్మతు చేయాలంటూ కొద్దిసేపు మాట్లాడి ఆ తర్వాత మీరు బాగా మాట్లాడుతున్నారు,.. మంచి వారంటూ మెస్మరైజ్‌ చేసింది. అలా కొద్ది రోజులు ఫోన్లో ముచ్చట్లు- చెబుతూ ఆకట్టు-కుంది. అంతటితో ఆగకుండా తన అమ్మతో మాట్లాడమని ఫోన్‌ ఇచ్చింది. కిలాడీ లేడీ అమ్మ ఇంకొంచెం మాయచేస్తూ, మా అల్లుడు చెడ్డవాడు. అతనికి రూ.3 లక్షలు ఇస్తే తెగతెంపులు చేసుకుంటాం. మూడు నెలల్లో విడాకులు ఇచ్చేస్తాం. ఆ తర్వాత మా అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటు-ందని నమ్మించింది. వాళ్ల మాటలు నమ్మిన మెకానిక్‌ తన వద్ద ఉన్న రూ. లక్ష ఇచ్చాడు. కొద్ది రోజుల తర్వాత కుమార్తె మెకానిక్కు ఫోన్‌ చేసి నా భర్త కొడుతున్నాడు.

గొంతు నులిమి చిత్రహింసలు పెడుతున్నాడని వగలమారి ఏడుపు ఏడ్చింది. నా భర్తకు డబ్బులు ఇచ్చి విడాకులు తీసుకుందామని మా బంధువు వద్దకు వెళితే అతను తన కోరిక తీర్చమంటు-న్నాడంటూ కొత్త నాటకం ఆడింది. నీవు మరో రూ. రెండు లక్షలు ఇస్తే నా మొగుడికి విడాకులు ఇచ్చేసి రేపు తెల్లాసరికల్లా నీ దగ్గరకు వచ్చేస్తా. నీకు భార్యను అయిపోతానంటూ మాట్లాడింది. ఒంటరి జీవితం గడుపుతున్న వృద్ధుడు ఆ కిలాడీ లేడీ మాటలకు కరిగిపోయి అప్పు చేసి రూ.1.20 లక్షలు ఇచ్చాడు. అవి తీసుకొని బాధపడకు తనకు బ్యాంకు అధికారులు తెలుసు రూ.5 లక్షలు లోన్‌ ఇప్పిస్తానంటూ అక్కడ నుంచి పలాయనం చిత్తగించింది.

రోజులు గడచినా ఆమె రాలేదు. పైగా ఇంకా డబ్బులు కావాలంటూ కొత్త నాటకం ఆడటంతో అనుమానం వచ్చి విచారిస్తే తల్లి, కుమార్తెలు కలిసి ఇలా నాటకాలు ఆడి నగదు దోచుకుంటు-ంటారని తెలుసుకున్నాడు. ఆ మహిళ తన భర్తతో హాయిగా కలిసి ఉంటూ తల్లితో పాటు అందరూ కలిసి మద్యం తాగడం, బిర్యానీ తింటూ జల్సాలు చేస్తూ ఒంటరిగా ఉండే మగవాళ్ళను వల విసిరి మోసగిస్తుంటారని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మోసం చేసిన మహిళల కోసం గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement