Friday, April 19, 2024

దళితులను దగా చేస్తున్న ప్రభుత్వం.. అంబేద్కర్‌ జయంతిని ప్రభుత్వమే నిర్వహించాలి: జీవీఎల్‌

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం దళితులను అన్ని రకాలుగా దగా చేస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. పోస్టు మెట్రిక్‌ ఉపకార వేతనాలు పొందే వారి సంఖ్యను మూడు లక్షలు కుదించడమే ఇందుకు నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వం దళిత వర్గాల అభివృద్ధికి అనేక పథకాలు తీసుకొచ్చి అమలు చేస్తుంటే..రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ నిధులను పక్కదారి పట్టించి మోసం చేస్తోందన్నారు. రానున్న రోజుల్లో పీఎం కిసాన్‌ యోజన పథకంలో నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లుగానే ఎస్సీ వర్గాల పథకాల సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లోనే వేసేందుకు కేంద్రం నిర్ణయించిందన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ విధానాలపై బీజేపీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి ఆందోళనా కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు.

ఏపీ బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధుల మంజూరు డిమాండ్‌ చేస్తూ నిరసన దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జీవీఎల్‌ నరసింహారావు మాట్లాడుతూ ఐదేళ్లలో కేంద్రం పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్పుల కోసం రూ.60వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఈ పథకంలో నాలుగు కోట్ల మంది దళిత విద్యార్థులు ప్రయోజనం పొందుతారని చెప్పారు. గతంలో ఏపీ నుంచి 6.70లక్షల మంది పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌ షిప్పులు తీసుకోగా ప్రస్తుతం 3.60లక్షల మందికి మాత్రమే ఇస్తున్నారన్నారు. మిగిలిన మూడు లక్షల మంది విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోందని జీవీఎల్‌ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్పులను ఈ ఏడాది నుంచి విద్యార్థుల ఖాతాల్లోనే జమ చేయనున్నట్లు తెలిపారు. దళిత యువతీ, యువకులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ నుంచి 90శాతం నిధులు ఇస్తుంటే దారి మళ్లించి ఇతర పథకాలకు వాడుతున్నారన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ నిధులతో కొనుగోలు చేసిన వాటిపై తన ఫొటోలు ముద్రించుకుంటే, ప్రస్తుత ప్రభుత్వం వేర్వేరు పథకాలకు మళ్లిస్తోందని ఆరోపించారు. దీనిపై రానున్న రోజుల్లో ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అంబేద్కర్‌ను రాజకీయంగా వాడుకుంటున్నారే తప్ప ఆయన స్ఫూర్తిని కొనసాగించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. మోడీ అంబేద్కర్‌ స్ఫూర్తికి చిహ్నంగా పంచతీర్థాల నిర్మాణం చేపడితే ఇక్కడ కనీసం విగ్రహాలు కూడా పెట్టడం లేదన్నారు. ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ జయంతిని ప్రభుత్వమే ఘనంగా నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంబేద్కర్‌ను అవమానించేలా రాజ్యాంగంపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ఆయన కోరారు. ఎస్సీ రిజర్వేషన్లు పొందేవారు ఖచ్చితంగా హిందువులుగానే ఉండాలని పేర్కొంటూ లేని పక్షంలో వారి వారి ఉద్యోగ, రాజకీయ పదవులు కోల్పోక తప్పదని జీవీఎల్‌ హెచ్చరించారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రమౌళి, ఎస్సీ మోర్చా ఇన్‌చార్జి వల్లూరు జయప్రకాష్‌, బీజేపీ రాష్ట్ర కోశాధికారి సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement