Wednesday, April 24, 2024

Delhi: లాయర్లకు ఫీజులివ్వడంపై ఉన్న శ్రద్ధ పర్యావరణంపై లేదు.. ఏపీ సీఎం జ‌గ‌న్‌కు సుప్రీం చీవాట్లు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పోలవరం ప్రాజెక్టు కారణంగా జరుగుతున్న పర్యావరణ ఉల్లంఘనలపై సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. పర్యావరణానికి జరుగుతున్న నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదని ప్రశ్నించింది. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన పర్యావరణ ఉల్లంఘనలపై రూ. 120 కోట్లు జరిమానా విధిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ రస్తోగి, జస్టిస్ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ సందర్భంగా కేసులో న్యాయవాదులకు ఫీజులు చెల్లించడం కోసం డబ్బులు వెచ్చిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, పర్యావరణానికి జరిగిన నష్టం విషయంలో జరిమానా సొమ్ము ఎందుకు చెల్లించలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలవరం కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదులకు ఎంత ఖర్చు చేసిందో చెప్పాలంటూ నోటీసులిస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక్క కేసు కోసం ఎంత మంది న్యాయవాదులను నియమిస్తారని ప్రశ్నించింది. న్యాయవాదులను రంగంలోకి దించడానికి ఉన్న ఆసక్తి పర్యావరణ పరిరక్షణపై లేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని గుర్తించిన ఎన్జీటీ, పురుషోత్తమపట్నంకు రూ. 24.56 కోట్లు, పట్టిసీమ ప్రాజెక్టుకు రూ. 24.90 కోట్లు, చింతలపూడి ప్రాజెక్టుకు రూ. 73.6 కోట్లు జరిగిమానా విధించింది. ఈ జరిమానా మొత్తాన్ని 3 నెలల్లోగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలికి చెల్లించాలని ఎన్టీటీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ సొమ్మును ఎలా వినియోగించాలో ఏపీ పీసీబీ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని ఎన్టీటీ సూచించింది.

ఈ మూడు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం మూడు వేర్వేరు అప్పీళ్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలపై కేసులో ప్రతివాది పెంటపాటి పుల్లారావు తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 50 వేల మంది ప్రజలు ప్రాజెక్టు ముంపునకు గురవుతున్నారని న్యాయవాది శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement