Tuesday, April 23, 2024

Big story | పల్లెలను వణికిస్తున్న జ్వరం ! పట్టణాలకు డెంగ్యూ భయం.. రోజురోజుకూ పెరుగుతున్న రోగుల సంఖ్య

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో : కోవిడ్‌ పూర్తిగా తగ్గుముఖం పట్టి రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు ఉన్నప్పటికీ కొంతమంది ప్రైవేటు వైద్యులు కోవిడ్‌ను బూచీగా చూపించి రకరకాల వైద్య పరీక్షల పేరుతో పేదల రక్తాన్ని జలగల్లా తాగేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పలు పట్టణాలు, పలు గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలు ఆయా ప్రాంత ప్రజలను వణికిస్తున్నాయి. అయితే సాధారణ జ్వరాలే అయినప్పటికీ కార్పొరేట్‌ వైద్యులు కోవిడ్‌ లక్షణాలు కనపడుతున్నాయంటూ అవసరం లేకపోయినా ఆసుపత్రుల్లో అడ్మిట్‌ చేసుకుని ఖరీదైన పరీక్షలు చేస్తూ వారిని నిలువునా దోచుకుంటున్నారు. జ్వరం తగ్గినా కొంతమందిలో రెండు, మూడు వారాలకు పైగా పొడి దగ్గు, జలుబు తగ్గడం లేదు. దీనిని ఆసరాగా చేసుకుని మరి కొంతమంది వైద్యులు అవసరం లేకున్నా హైపవర్‌ యాంటి బయాటిక్‌ను ఇస్తూ రోగుల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతూ వారి జేబులకు చిల్లులు పెడుతున్నారు. గత రెండు వారాలుగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జ్వరాలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతుండడం, ఇదే అదునుగా ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ కూడా అంతకు రెండింతలు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా సర్వేకు శ్రీకారం చుట్టింది. ప్రతీ ఇంటికి వెళ్లి వైద్య ఆరోగ్య సిబ్బంది సర్వే చేసి ఎవరికైనా అనారోగ్య సమస్య ఉంటే అక్కడికక్కడే డెంగ్యూ, టైఫాయిడ్‌, మలేరియా వంటి పరీక్షలను నిర్వహించి అవసరం అయిన వారికి నాణ్యమైన మందులను ఉచితంగా అందించే ప్రక్రియ ప్రారంభం అయింది.

నెలల తరబడి వేధిస్తోన్న దగ్గు, జలుబులు

- Advertisement -

జ్వరాల బారీన పడే వారిలో అత్యధిక శాతం మందికి జ్వరం తగ్గినా జలుబు, దగ్గు వేధిస్తూనే ఉంది. 10 నుంచి 15 రోజుల వరకు దగ్గు తగ్గకపోతుండడం, రాత్రి సమయాల్లో మరింత ఇబ్బందికరంగా ఉండడంతో కొంతమంది రోగులు ముందు జాగ్రత్త కోసం వైద్యశాలలో చేరి చికిత్స పొందుతున్నారు. వాస్తవానికి ఆసుపత్రుల్లో ఉండాల్సిన అవసరం లేదు. రోగుల భయాన్ని, జాగ్రత్తలను ప్రైవేటు ఆసుపత్రులు తమకు అనుకూలంగా మలచుకుని సొమ్ము చేసుకుంటున్నాయి. ఇతర దేశాల్లో ఇదే తరహా దగ్గుతో బాధపడేవారిలో కొత్త వైరస్‌ కనిపిస్తుందని రోగులను మరింత భయాందోళనలకు గురి చేస్తున్నారు. దీంతో జ్వరం వచ్చినా, దగ్గు తగ్గకపోయినా ఆర్ధికంగా బలంగా ఉన్న కొంతమంది రోగులు ప్రైవేటు ఆసుపత్రుల్లో అడ్మిట్‌ అవుతున్నారు. అటువంటి వారికి ఉదయం, సాయంత్రం రక్త పరీక్షల పేరుతో కార్పొరేట్‌ వైద్యులు నిలువునా దోచుకుంటున్నారు. మూడు నుంచి వారం రోజుల పాటు వైద్యశాలలోనే ఉండాలని భయపెడుతూ ఖరీదైన వైద్యాన్ని అందిస్తున్నట్లుగా షో చేసి బిల్లుల పేరుతో వేలకు వేలు గుంజేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు పట్టణ ప్రాంతాల్లోని కార్పొరేట్‌ వైద్యశాలల్లో ఇదే తరహా దందా నడుస్తోంది.

హైపవర్‌ యాంటి బయాటిక్‌తో మందుల్లోనూ చేతివాటం

గతంలో కోవిడ్‌ బారీన పడిన కొంతమందిలో జ్వరం వస్తే భయం కనిపిస్తుంది. 2020-21 సంవత్సరంలో రెండు విడతలుగా కోవిడ్‌ రాష్ట్రవ్యాప్తంగా అన్నివర్గాల ప్రజలను భయపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది కోవిడ్‌ బారిన పడి ఆర్ధికంగా చితికిపోయారు. మరి కొంతమంది మొదటి స్టేజీలోనే అనేక సందర్భాల్లో కోవిడ్‌ బారీన పడ్డారు. అటువంటి వారిలో ఎక్కువ మందికి జ్వరం వస్తే నీరసం, తదితర బలహీనతలు బయటపడుతున్నాయి. మరి కొంత మంది కోవిడ్‌ భయంతో ముందు జాగ్రత్త కోసం నేటికి మాస్కులు ఉపయోగిస్తున్నారు. ఈ నేపధ్యంలో కొంతమంది వైద్యులు కోవిడ్‌ను బూచీగా చూపించి సాధారణ జ్వరం వచ్చిన రోగులకు కూడా రకరకాల పరీక్షల పేరుతో వారిని మరింత భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు అవసరం లేకపోయినా హైపవర్‌ యాంటి బయాటిక్‌ మెడిసన్స్‌ ఇస్తూ రోగులను రెండు రకాలుగా దోచుకుంటున్నారు.

కార్పొరేట్‌ ఆసుపత్రులతో పాటు సర్కార్‌ ఆసుపత్రులు ఫుల్‌

రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల పరిధిలోని విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు వంటి మహానగరాలతో పాటు ఏలూరు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, అనంతపురం వంటి జిల్లా కేంద్రాల్లోని పలు కార్పొరేట్‌ ఆసుపత్రులతో పాటు సర్కార్‌ వైద్యశాలలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రికి వస్తున్న రోగుల్లో 60 శాతం మందికి పైగా జ్వరంతో బాధపడేవారే వస్తున్నారు. వారిలో 20 శాతం మందికి పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుకుంటుండగా, 40 శాతం మందికి పైగా రోగులు కార్పొరేట్‌ ఆసుపత్రులకే వెళ్తున్నారు. అటువంటి వారిలో 20 శాతం మందికి పైగా రోగులకు అవసరం లేకున్నా కార్పొరేట్‌ వైద్యశాలలు రకరకాల పరీక్షల పేరుతో వారిని జలగల్లా పట్టి పీడిస్తున్నారు. సాధారణ జ్వరంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరితే రెండు, మూడు రోజుల పాటు వైద్యశాలలో చికిత్స పేరుతో రూ.10 నుంచి 25 వేలు బిల్లుల రూపంలో దోపిడీ చేస్తున్నారు.

ఇంటింటా సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం

రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వేకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నిత్యం ప్రతీ ఇంటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. ఇంట్లో ఎంత మంది ఉన్నారు, వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటి, ఎవరికైనా జ్వరం వచ్చినట్లు గుర్తిస్తే అటువంటి వారికి అక్కడికక్కడే మూడు రకాల పరీక్షలను నిర్వహిస్తున్నారు. అందుకోసం వైద్య ఆరోగ్యశాఖ ఖరీదైన మూడు కిట్లను వైద్య సిబ్బందికి ఇస్తుంది. వాటితో పాటు అవసరమైన మందులను కూడా రోగులకు అందిస్తున్నారు. సర్వేలో భాగంగా ప్రతీ ఇంట్లో జ్వరాలతో ఆరా తీయడంతో పాటు పరిసర ప్రాంతాలు శుభ్రం చేయడంతో పాటు దోమలు, తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కడైనా మడుగు ఉండి అందులో దోమలు ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి వాటి నివారణకు అవసరం అయిన ఆయిల్‌ బాల్స్‌ను వదులుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటా సర్వే కార్యక్రమం శరవేగంగా సాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement