Tuesday, April 23, 2024

దుమ్ము రేగుతోంది.. ఊపిరి ఆడడం లేదు..

విజయనగరం, (ప్రభ న్యూస్‌) : విజయనగరం మీదుగా ఒడిశా వెళ్లేందుకు నూతనంగా నిర్మిస్తున్న రైల్వే లైన్‌ పనులు అటు వాహన చోదకులకు ఇటు వైఎస్‌ఆర్‌ నగర్‌ వాసులకు శాపంగా మారింది. సదరు పనులు చేయిస్తున్న కాంట్రాక్టర్‌ కనీస నియమనిబంధనలు పాటించకుండా తన ఇష్టానికి వాహనాలు నడిపిస్తుండడం వల్ల వైఎస్‌ఆర్‌ నగర్‌ వాసులు దుమ్ము, ధూళితో అవస్థలు పడడం అనివార్యమైంది. ఎంతగా శుభ్రం చేసుకుంటున్నా ప్రతీ ఇంటి పైకప్పు ప్రతీ రోజు సాయంత్రం అయ్యేసరికి ఎర్ర మట్టితో నిండిపోతోంది. మరోవైపు విజయనగరం నుంచి కొండ వెలగాడ, కొండకరకాం వైపు రాకపోకలు సాగిస్తున్న వాహన చోదకులు దుమ్మునే ఊపిరిగా పీల్చుకొని అనారోగ్యం పాలవ్వాల్సివస్తుంది.

అయితే, వెనుకబడిన జిల్లా కావడం వల్లనో? ఏమో? తెలియదు ప్రజారోగ్యంతో చెలగాటమాడే ఇటువంటి దురాగతాలు ఎన్ని జరిగినా అటు అమాత్యులు గానీ ఇటు అధికారులు గానీ పట్టించుకున్న దాఖలాలు లేకపోయాయి. దీంతో కోట్లాది రూపాయిల ప్రజాధనంతో దందా చేస్తున్న ప్రతీ ఒక్కరూ ప్రజారోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. రైల్వే లైన్‌ పనులు చేస్తున్న వారిని ఎంత మంది నిలదీసినా దిక్కున్నకాడ చెప్పుకోమంటున్నారు తప్ప బాధితుల గోడు పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా సమస్య తీవ్రతను అర్ధం చేసుకొని అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పలువురు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement