Friday, February 3, 2023

జ‌ల ర‌వాణా క‌లేనా..

అమరావతి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నా పాలకుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల స్వార్థం వెరసి కాకినాడ నుంచి పుదుచ్ఛేరి వరకు గల బకింగ్‌హామ్‌ కెనాల్‌ పునరుద్ధర ణకు నోచుకోవడం లేదు. బ్రిటీష్‌ హయాం లో వంద మీటర్ల వెడల్పున్న ఈ కాలువ ఇప్పుడు పది మీటర్ల వెడల్పుకు కుంచించు కుపోయింది. ఇరువైపులా ఆక్రమణలకు గురైంది. పలుచోట్ల ప్రజాప్రతినిధులు, ప్రముఖులు తమ పేరిట కాలువపై అడ్డంగా వంతెనలు నిర్మించుకున్నారు. అలాగే మరికొన్ని చోట్ల కాలువను చెరువులుగా మార్చేశారు. చేపలు, రొయ్యల సాగు చేస్తు న్నారు. బ్రిటీష్‌ హయాంలో ఈ కాలువ ద్వారా పెద్దెత్తున జలరవాణా జరిగేది. కాకినాడ నుంచి చెన్నై మీదుగా పుదుచ్ఛేరి వరకు వ్యవసాయ ఉత్పత్తులు, కలపను రవాణా చేశారు. ఓ దశలో రోజూ 1.25 కోట్ల టన్నులను రవాణ చేసిన చరిత్ర ఈ బకింగ్‌హామ్‌ కాలువకు ఉంది. తీరం పొడవునా 153 మంది పర్యవేక్షకులు ఎప్పటికప్పుడు కాలువలో నీటిమట్టాన్ని, ప్రవాహ వేగాన్ని సమీక్షించేవారు.అలాగే కాలువ వెంబడి 130 చోట్ల లాకులున్నాయి. వీటివద్ద సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేవారు. వీటితో పాటు 50 చోట్ల అతిధి గృహాలు కూడా నిర్వహించేవారు.

- Advertisement -
   

1880 నుంచి 1950 వరకు ఈ జల మార్గాన్ని విస్తృతంగా వినియోగించారు. కాకినాడ యాంకరేజ్‌ పోర్టుకొచ్చిన సరుకును ఈ కాలువ ద్వారానే ఇతర ప్రాంతాలకు రవాణా చేసేవారు. అలాగే మద్రాస్‌ పోర్టుకు చేరిన సరుకు రవాణాకు కూడా ఈకాలువను ఉపయోగించేవారు. బ్రిటీష్‌ పాలనలో సైన్యం రాకపోకలకు కూడా ఈ కాలువపైనే ఎక్కువగా ఆధారపడేవారు. అయితే 1950 తర్వాత రవాణాలో వేగం పెరగడం, తరచూ తుపాన్‌ల తాకిడి కారణంగా కాలువపై రవాణా తగ్గుముఖం పట్టింది. రాన్రాను ఈ కాలువపై రవాణాను నిలిపేశారు. అనంతరం కాలువ పలుచోట్ల ఆక్రమణల బారిన పడింది. అధికారంలో ఉన్న వ్యక్తులు ఈ కాలువను ఆక్రమించి ఇతర అవసరాలకు వినియోగించడం మొదలైంది.
పునరుద్ధరణ ప్రయత్నాలు
2007లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం జాతీయ జలరవాణా అభివృద్ధి పథకం క్రింద బకింగ్‌హామ్‌ కెనాల్‌ పునరుద్ధరణకు ప్రతిపాదించింది. ఇందుకోసం ఓ నిపుణుల బృందాన్ని నియమించింది. ఈ బృందం కాలువ వెంబడి పరిశీలన జరిపింది. కేవలం 1400కోట్లు వ్యయం చేస్తే తిరిగి ఈ కాలువను జల రవాణాకనుగుణంగా తీర్చిదిద్దొచ్చని నివేదికిచ్చింది. అయితే అప్పటికే అన్యా క్రాంతమైన కాలువ భూముల్ని తిరిగి స్వాదీనం చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఆక్రమణల తొలగింపు తప్ప అదనంగా ఒక్క సెంటు భూసేకరణ కూడా అవసరం లేదని తేల్చి చెప్పింది. అయితే ఈ ప్రతిపాదన ఆచరణకు నోచుకోలేదు. కేం ద్రం నిధులిచ్చేందుకు ముందుకొచ్చినా రాష్ట్రం నుంచి సహకారం అందలేదు. అప్పటి ప్రభుత్వం కాలువ వెంబడి ఆక్రమణల తొలగింపుపై ఆసక్తి ప్రదర్శించలేదు. కాగా 2016లో ఎన్‌డీఏ ప్రభుత్వం జాతీయ జలమార్గాల చట్టాన్ని తెచ్చింది. దేశవ్యాప్తంగా 111 జలమార్గాల పునరుద్ధరణకు ప్రతిపాదనలు చెసింది. ఇందులో జాతీయ జలరవాణా మార్గంగా బకింగ్‌హామ్‌ కెనాల్‌ను ప్రకటించింది. దీని విస్తరణ, పునరుద్ధరణకు నిధులు కేటాయించింది. అప్పట్నుంచి ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్రంలో ప్రభుత్వాలెన్ని మారినా ఈ కాలువ భూముల ఆక్రమణల తొలగింపు విషయంలో ఒకే పంథా అనుసరిస్తున్నాయి.
అణాపైసా అవసరం లేదు
ఈ ప్రాజెక్ట్‌ మొత్తం కేంద్రప్రభుత్వ పరి ధిలోకొస్తుంది. ఒక్కసారి ఈకాలువను జాతీయ జలరవాణా వ్యవస్థగా ప్రకటించడంతో దీని పునరుద్ధరణ, విస్తరణ, మరమ్మతులు వంటివాట న్నింటికి కేంద్రమే నిధులిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందల్లా ఒక్కటే. ఆక్రమణల్ని తొలగించడం, అడ్డగోలుగా నిర్మించిన వంతెనల్ని కూల్చివేయడం. అంతకుమించి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెట్టుబడిపెట్టాల్సిన అవసరం లేదు. జలరవాణా అందుబాటులోకొస్తే కాకినాడ నుంచి విజయవాడ, ఒంగోలు, చెన్నై మీదుగా పుదుచ్చేరి వరకు పారిశ్రామిక కారిడార్‌ కూడా విస్తరించే అవకాశముంది. అలాగే జలరవాణాతో పాటు ఈ కాలువ పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతుంది.
ఇలాంటివే మరికొన్ని
కేంద్రం నిధులిచ్చినా రాష్ట్రం ఆసక్తి చూపని మరికొన్ని పథకాలు కూడా ఉన్నాయి. కాకినాడ నుంచి ఉప్పాడ వరకు గతంలోనే సముద్రం వెంబడి రహదారి నిర్మించారు. అయితే ఈ రహదారి నేవీకి చెందిన స్థలం మీదుగా సాగుతోంది. ఈ స్థలాన్ని అంతకు ముందే నేవీ తన అవసరాల కోసం ప్రభుత్వం నుంచి తీసుకుంది. దీని విలువను కూడా నేవీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ చేసింది. ఈ మొత్తంతో సమాంతరంగా మరో రహదారిని అభివృద్ధి చేయాల్సుంది. ఈ నిధుల్ని కేవలం ఆ రహదారి నిర్మాణానికి మాత్రమే వ్యయం చేయాలి. అయితే నిధులున్నా ఈ రహదారి నిర్మాణంపై ప్రభుత్వం ఆసక్తి చూపడంలేదు. నేవీ అధికారులు పలు సందర్బాల్లో భద్రతా కారణాల రీత్యా ఈ రహదారిని మూసేస్తున్నారు. ఆ సమయాల్లో కాకినాడ నుంచి ఉప్పాడ వైపు వెళ్లే బీచ్‌ రోడ్డుపై రవాణా నిల్చిపోతోంది. ప్రస్తుతం కాకినాడ తీరంలో సముద్రంపై సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. దీంతో నేవీ తన అధీనంలోని రహదారిని దిగ్భందనం చేసింది. అలాగే కాకినాడ మీదుగా భారతమాల రహదారిని కేంద్రం ప్రతిపాదించింది. ఇందుకు నిధులు కూడా విడుదల చేసింది. కానీ దీని నిర్మాణంపై కూడా ప్రభుత్వం ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. రెండో ప్రపంచయుద్దంలో కాకినాడ నుంచి కోటిపల్లి వరకు గల రైల్వేలైన్‌ను తొలగించారు. స్వాతంత్య్రానంతరం దీని పునరుద్ధరణకు పలు ప్రయత్నాలు జరిగాయి. బాలయోగి స్పీకర్‌గాఉండగా కాకినాడ నుంచి కోటిపల్లి వరకు రైల్వేలైన్‌ పునర్‌నిర్మాణం జరిగింది. అయితే దీన్ని నర్సాపురం వరకు పొడిగిస్తేనే సార్థకత చేకూరుతుంది. ప్రయాణీకులకు ఉపయోగంలోకొస్తుంది. అయితే భూసేకరణతో పాటు నిర్మాణ వ్యయంలో 50శాతాన్ని రాష్ట్రం భరించాలని రైల్వేశాఖ నిబంధన విధించింది. ఈకారణంగా ఈ ప్రాజెక్ట్‌ నత్తనడకన సాగు తోంది. రైల్వేశాఖ తన వంతు నిధులు విడుదల చేస్తున్నా రాష్ట్రం మాత్రం తన భాగస్వామ్య నిధుల విడుదలపై తీవ్రఅలక్ష్యం వహిస్తోంది. ఇటువంటి నిధుల్తో కూడిన ప్రాజెక్టులు పూర్తవుతాయన్న విశ్వాసం ప్రజల్లో ఎలాగూ లేదు. కనీసం నిధుల్తో సంబంధం లేకుండా పూర్తిగా కేంద్రమే ఆర్థికభారం మోసి బకింగ్‌హామ్‌ కెనాల్‌ పునరుద్ధరణ, భారతమాల రోడ్డు, నిధులు అందుబాటులో ఉన్న బీచ్‌రోడ్‌ నిర్మాణాలపై కూడా రాష్ట్రం దృష్టి పెట్టకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement