Thursday, December 12, 2024

CTR| వర్చువల్ గా విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం

చిత్తూరు, నవంబర్ 7 (ఆంధ్రప్రభ బ్యూరో) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలం తోటకనుమ వద్ద రూ.38 కోట్ల విలువతో నిర్మించిన 132/33 కె.వి విద్యుత్ ఉపకేంద్రాన్ని, సంబంధిత అనుసంధాన లైను పనులను అమరావతి తాళయ పాలెం 400/220 కెవి ఉప కేంద్రం నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా ప్రారంభించారు. వి.కోట నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో వి.కోట 132/33 కె.వి. విద్యుత్ ఉప కేంద్రం ను ప్రారంభించగా, వి.కోట నందు ఉప కేంద్రం శిలాఫలాకాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమరనాథ రెడ్డి ప్రారంభించారు. ఈ ఉప కేంద్రం ఏర్పాటు ద్వారా పలమనేరు నియోజక వర్గం వి.కోట, బైరెడ్డిపల్లి, కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలాల పరిధిలో వ్యవసాయ, గృహ రంగం మెరుగైన విద్యుత్ అందించుటకు ఉపయోగపడుతుంది. వి.కోట తోటకనుమ గ్రామంలో అధిక స్థాయి ఓల్టేజీ సామర్థ్యంతో 132/33 కె.వి. విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణం జరిగింది. తద్వారా సుమారు 46వేల మంది లబ్ధి పొందనున్నారు.

ట్రాన్స్ ఫార్మర్ సామర్థ్యం 2 x 31.5 యం.వి.ఎ గా నిర్మించారు. 132 కె. వి లైను (1.706 కి. మీ): ప్రస్తుతం ఉన్న 132 కె. వి. పలమనేరు – శాంతిపురం లైను ను 132/33 కె. వి. వి.కోటకు లిలో పద్ధతిలో కలుపనున్నారు. ఈ ఉప కేంద్రం ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతంలో గృహ, వ్యవసాయ రంగానికి మెరుగైన నాణ్యమైన విద్యుత్ అందించుట దోహదపడుతుంది. ఓల్టేజి హెచ్చుతగ్గుల సమస్యలు, విద్యుత్ ప్రసార నష్టములు పరిష్కార మార్గం లభించింది. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సబ్ స్టేషన్ లో నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ ఆపరేషన్ ఇస్మాయిల్, పలమనేరు ఆర్డిఓ భవానీ, ఈఈ శ్రీనివాసమూర్తి, ఏపీ ట్రాన్స్ కో ఈఈ చంద్ర శేఖర్, ఈఈ చిన్నప్ప శేఖర్, ఏడీ గణేష్ రెడ్డి, తహసీల్దార్ పార్వతి, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement