Thursday, April 18, 2024

గ్రామ, వార్డు సచివాలయాల బిల్లు రెడీ!.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

అమరావతి, ఆంధ్రప్రభ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకుగానూ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల శాఖ చట్టం – 2022పై ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వికేంద్రీకృత పాలనను ఇప్పటికే విజయవంతంగా అమలు చేయబడుతోంది, ప్రతి నెలా స్థానికంగా వస్తున్న 15 లక్షల దరఖాస్తులను పరిష్కరిస్తున్నారు. ఈ ముసాయిదా బిల్లుకు సంబంధించి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ముసాయిదా బిల్లును మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత సెప్టెంబర్‌ 15 నుండి ప్రారంభం కానున్న సమావేశాల సందర్భంగా శాసనసభలో ప్రవేశపెట్ట నున్నారు.

అసెంబ్లి సమావేశాలకు ముందుగా మరోమారు కేబినెట్‌ సమావేశమై ఈసారి ప్రవేశపెట్టనున్న బిల్లులకు ఆమోదం తెలపనుందని తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ చట్టం – 2022కు కూడా కేబినెట్‌ ఆమోదం తెలుపుతుందని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో 15 వేలకు పైగా సచివాలయాలు ఉన్నాయి, ఇందులో 1.30 లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈసచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఎవరెవరు ఏఏ బాధ్యతలు నిర్వర్తించాలన్నదానిపై ఇప్పటికే ఒక స్పష్టత ఉంది. ఆమేరకే వారు తమతమ విధులను నిర్వహిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తున్నారు.

అందులో భాగంగానే సచివాలయ ఉద్యోగులు 540కి పైగా సేవలను అందించడానికి ప్రభుత్వం వీలు కల్పించింది. వీటిలో సవరణల కోసం ధరఖాస్తులు, భూమి టైటిల్‌ల లావాదేవీల కోసం మ్యుటేషన్‌లు, సమీకృత, ఆదాయం, కుటు-ంబ సభ్యుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికేట్‌, రికార్డ్‌ హక్కుల (ఆర్‌ఓఆర్‌) – 1బీ సర్టిఫికేట్‌, కంప్యూటరైజ్డ్‌ అడంగల్‌ సర్టిఫికేట్‌, వ్యవసాయ భూములకు నీటి పన్ను చెల్లింపు మరియు జనన, మరణం, కులం మరియు ఇతర ధృవపత్రాల జారీ వంటి అనేక రకాల సేవలు ఉన్నాయి. గతంలో ప్రజలు తమ సమస్యలకోసం మండల, జిల్లా కేంద్రాల చుట్టూ పనులు మానుకుని తిరగాల్సి వచ్చేంది. దీనికి ఫుల్‌స్టాఫ్‌ పెడుతూ, సచివాలయాల్లోనే వివిధ రకాల పనులు పూర్తి చేయడంతో ప్రజల నుంచి ప్రశంసలు అందాయని అధికారులు చెబుతున్నారు.

ఈ సెక్రటేరియట్‌ల సేవలు దేశవ్యాప్తంగా ప్రశంసనీయాంశం పొందాయి. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సచివాలయాలను తమ సొంత రాష్ట్రాల్లో అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఏపీలో అమలవుతున్న ఈ సచివాలయ వ్యవస్థల పనితీరు, రైతు భరోసా కేంద్రాల పనితీరుపై అధ్యయనం చేసేందుకు దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీకి తమ ప్రతినిధుల బృందాన్ని పంపి అధ్యయనం చేయిస్తున్నాయి. ఈక్రమంలోనే సచివాలయ వ్యవస్థను మరింతగా పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఈనెలలో జరగబోయే అసెంబ్లి సమావేశాల్లో దీనిపై బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అయితే, దీనిలో ఎటువంటి నిబంధనలు పొందుపర్చారన్నదానిపై పూర్తి సమాచారం ఇంకా తెలియరాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement