Friday, March 29, 2024

వెలిగొండ ప్రాజెక్ట్ ప‌నులు ఆపాల్సిందే – తెలంగాణ డిమాండ్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ- ఏపీల మధ్య కృష్ణా నదీ జలాల వివాదం ముదురుతుంది. నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలం నుంచి కృష్ణా పరివాహక ప్రాంతాల అవతలకు నీటిని తరలించే ప్రాజెక్టు పనుల్లో ఏపీ ప్రభుత్వం వేగం పెంచడంతో తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీశైలం నుంచి ఇప్పటికే 80వేల క్యూసెక్‌ల నీటి తరలింపు కోసం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతుండగానే మరోవైపు వెలిగొండకు ప్రాజెక్టుకు 43.5 టీఎంసీల నీటి తరలింపు పనులు ఏపీ ప్రభుత్వం చేపట్టి పనుల్లో వేగం పెంచడంతో కృష్ణా నీటికి భారీ గండి పడే ప్రమాదం ఏర్పడింది. తెలంగాణ భూములకు నీరు అందించే పరిస్థితితో పాటుగా శ్రీశైలం జలవిద్యుత్‌ ప్రాజెక్టుకు నీటి సమస్య తలెత్తనుంది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్‌ అధికారులు స్పందిస్తూ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే వెలిగొండ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని కృష్ణా బోర్డు చైర్మన్‌ నందన్‌ కుమార్‌కు ఈఎన్‌సీ మురళీధర్‌ రావు ఫిర్యాదు చేశారు.

అనుమతులు లేని వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం నిలిపి వేయాలి
నది పరివాహక ప్రాంతంలోపల నిర్మించే ప్రాజెక్టు లకు ప్రాధాన్యత ఇవ్వాలనే కృష్ణా ట్రిబ్యునల్‌ -1 అవార్డును ధిక్కరించి ఏపీ కృష్ణా పరివాహక ప్రాంతం అవతలకు భారీగా నీటిని తరలించేందుకు నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్టు పనులు నిలిపి వేయా లని ఈఎన్‌సీ మురళీధర్‌రావు కేఆర్‌ఎంబీకి లేఖ రాశారు. 1960 తర్వాత నిర్మించే ప్రాజెక్టులు పరివాహక ప్రాంతాలపరిధిలోనే ఉండాలని ఖచ్చితమైన నిబంధనలు ఉన్నాయి. అలాగే నీటి కేటాయింపులు ఉంటేనే నిర్మాణాలు చేపట్టాలని బచావత్‌ ట్రిబ్యునల్‌ పేర్కొన్న విషయాన్ని మురళీధర్‌ రావు లేఖలో ప్రస్తావించారు. అయితే ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు నీటి వాటాల కేటాయింపుల్లో అన్యాయం జరుగు తుందని ఆయన లేఖలో విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికీ న్యాయం జరగలేదని పేర్కొన్నారు.

గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మిగులు జలాలను బేసిన్‌ ఆవలకు తరలించి తెలంగాణ భూములను బీడుభూములుగా మార్చిందని ఈఎన్‌సీ మురళీధర్‌ పేర్కొన్నారు. ఈ విధానాలను సవరించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న అనేక ప్రాజెక్టులకు నీటి సమస్య ఏర్పడనుందని తెలిపారు. కృష్ణా జలాల వాటామేరకు తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్చులకు చెందాల్సిన నీటిని మిగులు జలాల పేరుతో ఏపీ తరలించుకు పోయోందుకు నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు తక్షణం నిలిపివేసే విధంగా కేఆర్‌ఎంబీ చర్యలు తీసుకోని పక్షంలో న్యాయపోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. బచావత్‌ ట్రిబ్యునల్‌,ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014 ప్రకారం అనుమతులు లభించాకే వెలిగొండ ప్రాజెక్టును నిర్మించాలని పేర్కొన్నారు.

రోజుకు 1 టీఎంసీ తరలింపు

- Advertisement -

కృష్ణా నది నుంచి కేవలం 299 టీఎం సీల నీటిని వినియోగించుకునేందుకు తెలంగాణ నిర్మి స్తున్న ప్రాజెక్టులకు నీటి గండం ఏర్పడే ప్రమా దం వెలిగొండతో ఏర్పడింది. ఏపీలో విస్తరించిన నల్లమల అడవుల్లో ఉన్న కొండల వరుసలను వెలిగొండగా వ్యవహరిస్తారు. ఈ కొండల మధ్యలో నల్లమల అడవి ప్రాంతంలో కొల్లంవాగు కృష్ణా నదిలో కలిసేచోట 43.5 టీఎంసీల నీటిని తరలించి కృష్ణా బేసిన్‌ ఆవలకు ప్రవహింపచేసే ప్రాజెక్టు వెలిగొండ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును 1994లో నాటి సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. 10.7 టీఎంసీల తరలింపు కోసం ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. అయితే రెండవదశలో 2004లో వైఎస్‌ ఆర్‌ ప్రాజెక్టు సామర్ధ్యాన్ని పెంచి 43.5 టీఎంసీలను కృష్ణా పరివాహక ప్రాంతం బయటకు పంపించేందుకు భారీ ప్రాజెక్టుగా తీర్చిదిద్దారు. 9.2 మీటర్ల వ్యాసార్థ్యంతో 243 క్యుమెక్స్‌ సామర్ధ్యంతో రెండు సొరంగ మార్గాల నుంచి శ్రీశైలం నుంచి 45రోజులు రోజుకు సగటున ఒకటీఎంసీ చొప్పున నీటిని వెలిగొండకు తరలించడంతో శ్రీశైలం ప్రాజెక్టు నీరు ఇతరప్రాజెక్టులకుఅందడం ప్రశ్నార్ధకం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ చేస్తున్న ఫిర్యాదుకు కృష్ణా నది యాజమాన్యం బోర్డు ఏమేరకు స్పందిస్తుందో వేచి చాడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement