Tuesday, April 23, 2024

AP: ఒంటరి పోరు దిశగా టీడీపీ అడుగులు.. తెలుగు తమ్ముళ్లలో అంతర్మథనం

అమరావతి, ఆంధ్రప్రభ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరి పోరుకు తెదేపా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకూ ఆ పార్టీ అధిష్టానం పొత్తులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యంకావన్న భావనకు వచ్చింది. ఈనేపథ్యంలో పార్టీ కేడర్‌ను సింగిల్‌ ఫైట్‌ దిశగా నడిపించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. పొత్తులకు ఇంకా సమయం ఉందని, కలసివచ్చే వారితో ముందుకు వెళ్లాలన్న యోచన ఉన్నప్పటకీ, ఇంకా అవతల పక్షాల నుండి సరైన స్పందన లేదని, ఈ నేపథ్యంలో పోరుకు సిద్ధం కావాలని పార్టీ నేతలు, క్యాడర్‌కు స్పష్టంచేస్తున్నారు. అయితే, పార్టీ ముఖ్య నేతలతోపాటు కేడర్‌ కూడా పొత్తులుంటేనే అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోగలమన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన కలిసి వస్తే విజయం తథ్యమన్న ధీమాను వ్యక్తపరుస్తున్నారు. అయితే, అధిష్టానం మాత్రం దీనిపై ఆచితూచి అడుగులు వేస్తోంది. పొత్తులున్నా, లేకున్నా పోరుకు ఎట్టి పరిస్థితుల్లో సిద్ధం కావాలని, ఆనాటి పరిస్తితులకు అనుగుణంగాన నిర్ణయాల ఉంటాయని నేతలకు స్పష్టంచేస్తూవస్తోంది. గత ఎన్నికల్లో పొత్తులు లేకపోవడంవల్ల జరిగిన నష్టాన్ని కేడర్‌ అధిష్టానం దృష్టికి తీసుకొస్తూ కొంత ఒత్తిడిని పెంచుతోంది. మరోవైపు కొందరు నేతల వాదన మాత్రం భిన్నంగా ఉంది. పార్టీ సింగిల్‌గానే పోటీచేస్తే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. అయితే, మెజార్టీ నేతలు మాత్రం పొత్తులు లేనిపక్షంలో నష్టంతప్పదని ఖరాఖండీగా చెబుతున్నారు.

కేడర్‌లో నిరాశ
ఇదిలావుంటే ఇప్పటివరకూ జనసేనతో పొత్తు ఖాయమన్న ధీమాలో ఉన్న తమ్ముళ్లు ఇప్పుడు కొంత నిరాశలో ఉన్నారు. తాజాగా ప్రధానితో పవన్‌ కల్యాణ్‌ భేటీ అనంతరం ఒక్కసారిగా రాజకీయ పరిణామాల్లో మార్పులు చోటుచేసుకోవడం, మరోవైపు జనసేన నేతలనుండి ఎటువంటి స్పందన లేకపోవడం గందరగోళానికి గురిచేస్తోంది. ఇటీవల పవన్‌ కల్యాణ్‌ను చంద్రబాబు స్వయంగా కలిసి మద్దతు తెలిపిన సమయంలో కేడర్‌ అంతా ఎంతో ఉత్సాహంలో మునిగిపోయారు. ఆతరువాత పరిణామాలు ప్రస్తుతం వారికి మింగుడు పడటం లేదు. కేడర్‌తోపాటు నేతలు కూడా జనసేన భవిష్యత్‌ నిర్ణయం ఏవిధంగా ఉంటుందో పొత్తులకు కలసి వస్తారా లేదా అని కొంత ఆందోళన చెందుతున్న పరిస్తితి స్పష్టంగా కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement