Wednesday, March 27, 2024

గౌరవం లేని చోట ఉండి ఏం లాభం: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల సంచలన వ్యాఖ్యలు

టీడీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. పార్టీని వీడినున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు, నేతలు బుజ్జగించినా.. ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం లేదని తెలుస్తోంది. పార్టీ నాయకత్వంలో మార్పు రావాలంటూ గతంలో చాలా సందర్భాల్లో గోరంట్ల బహిరంగంగా వ్యాఖ్యానించారు. పార్టీ సీనియర్ అయిన తనను పట్టించుకోకపోవడంతో అసంతృప్తిలో ఉన్న ఆయన… టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలో ఆయన ఓ న్యూస్ ఛానల్‌తో లైవ్ డిబేట్‌లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌరవం లేని చోట ఉండి ఏం లాభమని వ్యాఖ్యానించారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తాను ఏం అడగలేదని.. ఎలాంటి కాంట్రాక్ట్‌లు చేయలేదన్నారు. చంద్రబాబు, లోకేష్ తాను ఫోన్ చేసినా తీయలేదని.. పట్టించుకోకపోయినా పర్లేదు అనే భావన కావొచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నడిపే విధానంలో కార్పొరేట్ స్టైల్ వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుమస్తాలు పార్టీని నడుపుతున్నారని పేర్కొన్నారు. పార్లమెంటరీ కమిటీలు అనవసరంగా తీసుకొచ్చారన్నారు. దీని వల్ల పార్టీ నష్టపోయిందన్నారు.

పార్టీ మారితే ఎంతో మంది నెత్తిన పెట్టుకున్నారని గోరంట్ల అన్నారు. కారెం శివాజి, జూపూడి, ఆది నారాయణరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్‌లకు ఎందుకు పదవులు ఇచ్చారని ప్రశ్నించారు. వాళ్లంతా మళ్లీ పార్టీ ఎందుకు మారారని.. ఇలాంటి వాళ్లతో పార్టీకి నష్టం జరుగుతోందన్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్ట పడుతున్నవారికి విలువ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ మారిన వారికి ఉన్న విలువ పార్టీలో ఉన్నవాళ్లకు లేదన్నారు. పార్టీ జెండా మోసిన వాడిని కాదని.. ఎవర్నో తెచ్చి నెత్తిన పెట్టుకుంటే ఎలా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో కూడా అదే జరిగిందని..అందుకే పార్టీ ఘోరంగా ఓడిపోయిందని గోరంట్ల వ్యాఖ్యానించారు. తాను మొదటి నుంచి పార్టీని తన జీవితంగా అనుకున్నానని చెప్పారు. నిర్ణయాలు విషయంలో ఇంకా చాలా మార్పు రావాలని గోరంట్ల పేర్కొన్నారు.

ఇది కూడా చదవండిః ఈనెల 24న కేసీఆర్ దత్తత గ్రామంలో రేవంత్‌రెడ్డి దీక్ష

Advertisement

తాజా వార్తలు

Advertisement