Friday, March 29, 2024

రాష్ట్ర భవిష్యత్ కోసం అమరావతి రైతుల పోరాటం: కొల్లు

అమరావతి రాజధాని కోసం రైతులు, మహిళలు చేస్తున్న పోరాటం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినదని  మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర అన్నారు. ఒక నియంతపై పుడమితల్లి తల్లి బిడ్డలు సాగిస్తున్న పోరాటం నేటికి 500 రోజులకు చేరిందని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేకుండా అనాథ మిగిలిన ఆంధ్రప్రదేశ్‌ను అమరావతి రైతులు అక్కున చేర్చుకున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి రాజధాని నిర్మాణం కోసం దాదాపు 33 వేల ఎకరాలు ఇచ్చారని చెప్పారు. అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని తాము స్వాగతిస్తున్నామని అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని ఆయన గుర్తుచేశారు. ఆంధ్రల కలల రాజధాని ఊపిరి పోసుకుంటున్న తరుణంలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేస్తున్నారని కొల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజధాని ఇక్కడే ఉంటుందని రైతులను, రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి నమ్మించి మోసం చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రకటనపై రైతులు, ఆడ బిడ్డలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారని తెలిపారు. రైతులపై అక్రమ కేసులు పెట్టిన, మహిళపై పోలీసులతో దాడి చేయించినా వెనక్కి తగ్గకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం అమరావతి రైతులు చేస్తున్న పోరాటం తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ తాను చేసిన పొరపాటున సరిదిద్దుకునే రోజు దగ్గరలోనే ఉందన్నారు. అమరావతి రైతుల ఉద్యమానికి రాష్ట్ర ప్రజల మద్దతు ఎప్పుడు ఉంటుందని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement