Friday, March 29, 2024

రత్నకుమార్ మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటు

దిగ్గజం గాయకుడు ఘంటసాల రెండో తనయుడు ఘంటసాల రత్నకుమార్ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి కుమారుడు ఘంటసాల రత్నకుమార్ ఆకస్మిక మరణం విషాదకరం అని అన్నారు. పలు భాషల్లో 1000కి పైగా సినిమాలకు డబ్బింగ్ కళాకారుడిగానూ, 30 చిత్రాలకు మాటల రచయితగానూ పనిచేసిన రత్నకుమార్ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు.  రత్నకుమార్ ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. రత్నకుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కాగా, ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో తనయుడు ఘంటసాల రత్నకుమార్ ఇవాళ ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. రత్నకుమార్ ఇటీవల కొన్నిరోజుల పాటు కరోనా చికిత్స పొందారు. చికిత్స అనంతరం నెగెటివ్ వచ్చింది. అయితే, ఆయన కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. ఆయ‌న మృతితో సినీ ప‌రిశ్ర‌మ దిగ్భ్రాంతికి గురైంది. ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న మృతికి నివాళులు అర్పిస్తూ కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement