Thursday, April 18, 2024

AP | టాస్క్​ఫోర్స్​ స్పెషల్​ ఆపరేషన్​.. 16 మంది ఎర్ర దొంగల అరెస్టు

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో): కడప, అన్నమయ్య జిల్లాల్లో రెండు చోట్ల నిర్వహించిన దాడుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 14 మందిని అరెస్టు చేసినట్టు ఎర్ర చందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ అధికారులు ఆదివారం వెల్లడించారు. కడప జిల్లా మైదుకూరు, అన్నమయ్య జిల్లా తుమ్మలబైలు ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి చేపట్టిన కూంబింగ్ లో 23 దుంగలను, కొన్ని వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ ఫోర్స్ డీఎస్పీలు మురళీధర్, చెంచుబాబు తెలిపారు. ఆర్ఐ చిరంజీవి, ఆర్ఎస్ఐ నరేష్ బృందం కడప సబ్ కంట్రోల్ నుంచి సీఎల్ బావి బేస్ క్యాంపు చేరుకుని అగ్నిగుండాల మీదుగా తిప్పిరెడ్డిపల్లి వద్ద కూంబింగ్ చేపట్టారు. అక్కడ నుంచి జోరగోడ్లు ప్రాంతానికి ఉదయం 6గంటల సమయానికి చేరుకోగా కొందరు ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు.

వారిని చుట్టుముట్టి 14మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 17ఎర్రచందనం దుంగలు, ఒక లగేజీ ఆటో, రెండు మోటారు సైకిళ్లు, 13పిడిలేని ఇనుపగొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో అనంతపురం జిల్లా, కదిరికి చెందిన మేకల నాగ మల్లప్ప నాయుడు (47), కడప జిల్లా ఖాజీపేటకు చెందిన ఇడగొట్టు నగేష్ (54), మైదుకూరుకు చెందిన ఇడగొట్టు నాగేశ్వరరావు (32), ఇడగొట్టు శ్రీనివాసులు (57), బ్రహ్మంగారిమఠానికి చెందిన దేవల్ల సుబ్బారాయుడు (39), చాపాడుకు చెందిన తమ్మిశెట్టి వెంకటసుబ్బయ్య (34), శ్రీపతి ప్రీదిపాల్ (21), రామరాజశేఖర్ (34), శ్రీరామ జాస్వా (25), ప్రాద్దుటూర్ టౌన్ కు చెందిన మామిల్ల నాగేంద్ర (25), ఇల్లూరు వినోద్ (20), కడప టౌన్ కు చెందిన మల్లెలబోయిన వెంకటేశు (46), అనంతపురం జిల్లా కుంట మండలానికి చెందిన దండి సూరి (32), సత్యసాయి జిల్లాకు గాలంపేటకు చెందిన మొలకల శేషాద్రి (37)ఉన్నారు.

అదే విధంగా లింగాధర్ టీమ్ సానిపాయ బేస్ క్యాంపు నుంచి పొంతరేవల మీదుగా కూంబింగ్ చేస్తుండగా, అన్నమయ్య జిల్లా రాజంపేట రేంజి లోని తుమ్మలబైలు చేరుకుని చిప్పగొందిదొన వద్దకు రాగా, అక్కడ కొందరు ఎర్రచందనం దుంగలు మోసుకుని వస్తూ కనిపించారు. వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, కొందరు పారిపోగా, ఇద్దరిని పట్టుకోగలిగారు. వీరి నుంచి 6ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని తమిళనాడు తిరువన్నామలై జిల్లా జమునామత్తూరుకు చెందిన శివరాజ్ (30), శివమణి (45)గా గుర్తించారు. మొత్తం 23ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోగా, వీటి విలువ రూ.40లక్షలు ఉంటుందని డీఎస్పీలు తెలిపారు. ఈ కేసులను సీఐ బాలకృష్ణ, ఎస్ఐ మోహన్ నాయక్ దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement