Friday, April 19, 2024

BIG STORY: సారాయి కంపు.. విద్యార్థుల ప్రాణాలకే ముప్పు!

నందికొట్కూరు (ప్రభ న్యూస్): అది ఓ ప్రభుత్వ పాఠశాల. అందులో దాదాపు 135 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే, ఆ పాఠశాలకు సమీపంలో సారా కాచే కేంద్రం ఉంది. సారా కంపుతో విద్యార్థుల చదువులకు, వారి ప్రాణాలకే ముప్పు ఏర్పడింది. పాఠశాలకు సారా కాచే కేంద్రం సమీపంలో ఉండటంతో ఆ దుర్వాసనకు విద్యార్థులు చదువులకు ఆటంకం కలుగుతోంది. విద్యార్థుల చదువుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. అది కేవలం ప్రచారాలకు మాత్రమే సరిపోతుంది. నాడు- నేడు పేరుతో పనులను పాఠశాలల్లో చేపట్టి అభివృద్ధి చేస్తున్నా… అవి కొంత వరకు మాత్రమే పరిమితమయ్యాయి. పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఉన్న పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు విఫలమయ్యారని అనడానికి నిదర్శనం నందికొట్కూరు పట్టణంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలే.

నందికొట్కూరు పట్టణంలోని BSSR నగర్ (నీలి షికారి పేట) కాలనీ సమీపంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఉర్దూ పాఠశాలు రెండు ఉన్నాయి. ఇక్కడ ఎంపిపి పాఠశాలలో 83 మంది విద్యార్థులు, ఉర్దూ పాఠశాలలో 38 మంది చిన్నారులు చదువుతున్నారు. ఈ పాఠశాలలకు సమీపంలో కూత వేటు దూరంలో సారా బట్టి కేంద్రాలు నిర్వహిస్తున్నారు. అయితే ఆ సారా కాచిన వృధా చెక్కలు, పండ్లు, నీరంతా పాఠశాలకు సమీపంలో పరబోస్తున్నారు. దీని వల్ల విద్యార్థులకు దుర్వాసన వెదజల్లుతుంది. ఈ వాసనకు విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది.

గతంలో ఎమ్మెల్యే,కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారులు పాఠశాలను తనిఖీలు చేశారు. అయిన ఎవ్వరు ఈ పాఠశాల గురించి విద్యార్థుల భవిష్యత్ గురించి పట్టించుకోలేదని పలువురు చెబుతున్నారు. ఈ పాఠశాలను వేరే ప్రదేశానికి మార్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాలకు వెళ్లే ఎవ్వరైనా కూడా కనీసం పదినిమిషాలు కూడా ఉండలేరు. ఆ దుర్వాసనకు రోగాలు వస్తాయని భయపడుతున్నారు.

పాఠశాల దగ్గరలో వాసన తట్టుకోలేకపోతున్నామని, పాఠశాల చుట్టూ సారాయి కంపు వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు కాంపౌండ్ వాల్ కూడా లేకపోవడంతో ఎవరుపడితే వారు వెళ్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి విద్యార్థులకు పాఠశాలను మార్పు చేసేలా కృషి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, పట్టణ వాసులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement