Tuesday, April 23, 2024

CPI | కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పోరాటం, ఈ నెల 9 నుంచి 13 వరకు పాదయాత్ర : సీపీఐ నేత రామకృష్ణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి 13 వ తేదీవరకు పాదయాత్ర చేస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. ఈ పాదయాత్రకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. ఆదివారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు. తక్షణం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సీమ గర్జన సభపై విమర్శలు చేశారు. అధికార పార్టీ విధి సంక్షేమ కార్యక్రమాలను, ఇచ్చిన హామీలను అమలు చేయడమని, ధర్నాలు, ఆందోళనలు చేయడం ప్రతిపక్షాల విధి అని రామకృష్ణ వ్యాఖ్యానించారు. కానీ జగన్ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలను రివర్స్ పద్ధతిలో చేస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు చేయాల్సిన పనిని ‘సింహ గర్జన’ పేరుతో అధికార పార్టీలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు.
ఎవరిని మోసం చేయడానికి ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని చేపట్టారో అర్ధం కావడంలేదన్నారు.

కర్నూలులో హైకోర్టు పెడతామని రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, అలాగే పెట్టాల్సింది కేంద్రంలోని అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అని, కానీ సింహగర్జన పేరుతో ప్రజలను మోసం చేస్తోందని రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు ప్రజలను మోసం చేయడానికి ఈ కార్యక్రమాలు చేపట్టిందని దుయ్యబట్టారు. మూడేళ్ల కాలంలో రాయలసీమ ప్రజలకు ఏం చేసారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

“హంద్రీనివా కాల్వల ఆధునీకరణ జరిగిందా? ఏ ఒక్క కొత్త ప్రాజెక్ట్ తెచ్చారా? సీఎం సొంత జిల్లాలో ఉన్న గండికోట ప్రాజెక్ట్‌‌లో 16 టీఎంసీల నీటి నిల్వ ఉన్నప్పటికీ కాల్వలు లేకపోవడం వల్ల ఒక్క ఎకరాకు కూడా నీరు అందించలేకపోతున్నారని అన్నారు. గాలేరు-నగిరి ప్రాజెక్ట్ ను గాలికి వదిలేసారని మండిపడ్డారు. మూడున్నర సంవత్సరాల కాలంలో సాగునీటి ప్రాజెక్టులేవీ పూర్తి చేయలేదని, కొత్త కాల్వలు తవ్వలేదని విమర్శించారు. మరోవైపు రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోవడం పక్కన పెడితే, ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాప్తాడు ఎమ్మెల్యే బెదిరించడం వల్ల జాకీ పరిశ్రమ తరలిపోయిందని, కియా అనుబంధ పరిశ్రమలు రాకుండా పోయాయని ఆరోపించారు. 9వేల మందికి ఉపాధినిచ్చే, రూ. 9,500 కోట్ల పెట్టుబడులతో కూడిన అమర్ రాజా ఫ్యాక్టరీ ఏపీ నుండి తరలిపోయిందని అన్నారు. పరిశ్రమలు ఎందుకు తరలిపోతున్నాయో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ దౌర్జన్యకాండ వల్ల పరిశ్రమలు స్థాపించడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement