Friday, April 19, 2024

AP: బలపడుతున్న అల్పపీడనం.. దక్షిణ కోస్తా, రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు

అమరావతి, ఆంధ్రప్రభ: భార‌త వాతావరణ శాఖ సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అంబేద్కర్‌ తెలిపారు. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందన్నారు. శనివారంలోపు వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వైపు పయనించే అవకాశం ఉందని వెల్లడించారు.

దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రెండు రోజులపాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీవర్షాలు, చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు జ‌ల్లులు కురిసే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణాంధ్ర -తమిళనాడు తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడ‌ద‌ని సూచించారు. పిడుగులతో కూడిన వర్షాల కార‌ణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్ల కింద నిలబడవద్దని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement