Saturday, October 5, 2024

AP: పట్టపగలే చోరీ… ఐదు తులాలు బంగారం కొట్టేసారు..

శ్రీకాకుళం జిల్లా సోంపేట పట్టణంలో మహాదేవిపేట పేటలో ఇద్దరు దుండగులు ఓ ఇంటిలో మంచినీరు కావాలని అడిగి.. ఇద్దరు వృద్దులు ఉన్న ఇంటిలో చొరబడి ముసలమ్మ మెడపై కత్తి పెట్టి ఐదు తులాలు గోల్డ్ చైన్ ను తెంపి బైక్ పై పరారయ్యారు. ఇవాళ‌ ఉదయం 10గంటల సమయంలో సోంపేట పట్నంలో నిత్యం ప్రజలతో రద్దీగా ఉన్న మహదేవిపేట వీధిలో జగన్నాథస్వామి గుడి ఎదురుగా నివాసం ఉంటున్న గుంటుకు కామేశ్వరరావు ఇంట్లో ఓ అగంతకుడు ముఖానికి మాస్క్ వేసుకొని ఎరుపు టోపీ పెట్టుకుని మీ బాబు లేడా అంటూ ఇంటిలో ఉన్న గుంటుకు జీవరత్నం (64)ను ప్రశ్నించాడు.

లేడు బయటకు వెళ్ళాడని చెప్పిన వెంటనే తాగేందుకు మంచినీరు అడిగి బాటిల్ తో మంచినీరు ఇచ్చేందుకు ఇంటి తలుపు ఆమె తీస్తుండగా.. ఇంటిలో చొరబడి కత్తిని తీసి పీక పట్టుకొని అరిస్తే చంపేస్తామని బెదిరించి ఆమె మెడలో ఉన్న ఐదు తులాల పుస్తెలతాడు నల్లపూసలతో కూడిన బంగారాన్ని తెంపుకుపోయినట్లు ఆమె లబోదిబోమన్నారు. అప్పటికే ఆమె భర్త పూజ గదిలో భగవద్గీత చదువుకుంటూ ఉండటం, అతనికి కాస్త వినికిడి లోపం ఉండడంతో దుండగులు పరారయ్యారు. వీధిలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై ఎక్కుతున్న దొంగను గమనించి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అతనిపై కత్తితో దాడికి పాల్పడి బైక్ పై పారిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సోంపేట ఎస్సై బి.హైమావతి సంఘటన స్థలానికి చేరుకొని సమీపంలో ఉన్న బ్యాంక్ సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.

హడలిపోతున్న స్థానికులు…
సోంపేట నడిబొడ్డులో బ్యాంకు ఉన్న వీధిలో నిత్యం ప్రజలు తిరుగుతుంటారు… అలాంటి వీధిలో గత రెండు రోజులుగా రెక్కీ నిర్వహించి ఒంటరిగా మహిళలు ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తులు ముఖాలకు మాస్క్ తో పాటుగా టోపీ ధరిస్తూ నెంబర్ ప్లేట్లు లేని బైక్ ల‌పై తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. పట్టపగలే ఇటువంటి సంఘటన జర‌గ‌డంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పగడ్బందీ చర్యలు చేపట్టాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement