Thursday, March 30, 2023

పాపం సీతమ్మ..! ఎనిమిది నెలలుగా సామాజిక భద్రత పింఛను కరువాయె..

విజయనగరం, ప్రభన్యూస్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం మహిళలకు ఎంత పెద్ద పీట వేసిందో చెప్పుకునేందుకు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి జిల్లాల్లో ఉన్నతాధికారులు అన్ని విధాలా సన్నద్ధంగా వున్నారు. ఇంత వరకు బాగున్నా నేటికీ సామాజిక భద్రత పింఛన్ల లబ్ధికి దూరమైన వారు జిల్లాలో కోకొల్లలు వున్నట్లు పరిస్థితులు చెబుతున్నాయి. అధికారులు అవునన్నా.. కాదన్నా.. కొన్ని చోట్ల చెత్త రాజకీయాల కారణంగా నిజమైన అర్హులు సైతం పింఛను లబ్ధికి దూరమవుతున్నారు. ఒకటో తేదీన ఇంత మందికి ఇచ్చాం.. వేల కోట్ల రూపాయిలు వెచ్చించాం.. అంటూ ఘనంగా చెప్పుకుంటున్న ప్రభుత్వ పెద్దలు క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో తెలుసుకోలేని దుస్థితిలో వున్నారనడానికి సీతమ్మ వంటి బాధితులే తార్కాణం.

గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్‌ వ్యవస్థ ఒకవైపు, మండల, జిల్లా స్థాయిల్లో అధికార యంత్రాంగం మరోవైపు పారదర్శకత అంటూనే అసలైన అర్హులకు ‘సామాజిక భద్రత’ కొరవడినట్లు చేస్తున్న పరిస్థితి అన్ని వర్గాల వారిని విస్మయానికి గురి చేస్తోంది. తమ నిర్లక్ష్యాన్ని అధికారులు ఎంతగా కప్పిపుచ్చుకుంటున్నా జిల్లాలో నేటికీ వేల సంఖ్యలో అర్హులు సామాజిక భద్రత పింఛన్లకు నోచుకోవడం లేదన్నది ఒక అంచనా. ఆ వేలాది మందిలో ఎంత మంది దయనీయమైన జీవనం గడుపుతున్నారో తెలియదు గానీ తాజాగా సోమవారం ఓ 80 ఏళ్ల వృద్ధురాలు అనివార్యంగా కలెక్టరేట్‌ను ఆశ్రయించింది. గ్రీవెన్స్‌ సెల్‌ను ఆశ్రయిస్తే ఉన్నతాధికారులు ఏమైనా దయ చూపుతారేమోనన్న విశ్వాసంతో ఆమె కుటుంబ సభ్యులు ఉన్నపలంగా మంచంతో తోడ్కొని వచ్చిన దృశ్యం అందరినీ ఎంతగానో బాధించింది. నెల్లిమర్ల మండలం చంద్రంపేట పంచాయతీ పరిధి తాళ్లపూడిపేట గ్రామానికి చెందిన సిరిపురపు సీతమ్మకు గత ఎనిమిది నెలలుగా సామాజిక భద్రత పింఛను లేకుండా పోయింది.

- Advertisement -
   

అధికారులు చెబుతున్న ప్రకారం సీతమ్మ ఎనిమిది నెలల కిందటి వరకు దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్థులందరి మాదిరిగా నెలకు రూ.10 వేలు పొందేదని, వైద్య ఆరోగ్య శాఖ విచారణలో ఆ పింఛను పొందేందుకు సీతమ్మకు అర్హత లేదని తేలడంతో నిలిపేయడం జరిగింది. అయితే, సామాజిక భద్రత పింఛనును కూడా పునరుద్ధరించలేదు సంబంధిత అధికారులు. దీనికి వారు చెబుతున్న హాస్యాస్పద కారణం ఏంటంటే సీతమ్మ తనకు సామాజిక భద్రత పింఛను ఇప్పించాల్సిందిగా ఇంతవరకు విన్నవించుకోలేదట. మరి వాలంటీర్లు ఏమి చేస్తున్నారు? గ్రామ స్థాయిలో సచివాలయ ఉద్యోగులు ఏమి చేస్తున్నారు? అన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డే చెప్పాలి.

దీర్ఘ కాలిక వ్యాధులకు సంబంధించి తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించిన వారితో కుమ్మక్కయి భారీ మొత్తం దుర్వినియోగం చేసిన వారిపై ఇంత వరకు చర్యలు తీసుకోని వైనం అక్రమాలను, నిర్లక్ష్యాన్ని పెంచిపోషించినట్లయింది. ఇప్పటికైనా సీతమ్మ వంటి బాధితులకు వెంటనే సామాజిక భదత్ర పింఛను అందించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా పలువురు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement