Thursday, April 25, 2024

స్వల్పంగా తగ్గిన స్టీల్‌ ధరలు.. జగనన్న ఇళ్ల నిర్మాణాలు వేగవంతం

అమరావతి, ఆంధ్రప్రభ : ఇల్లు కట్టుకోవాలనుకోవటం అనేది చాలా మందికి తమ జీవితకాలంలో ఉండే అతిపెద్ద కోరిక. ప్రస్తుత ద్రవ్యోల్బణం సమయంలో అన్నింటి ధరలు పెరిగి భారంగా మారాయి. అయితే ఈ సమయంలో స్టీల్‌ ధరలు భారీగా తగ్గటం సొంతింటి కల నెరవేర్చుకోవాలి అనుకునేవారికి కలిసివస్తోంది. ఇక జగనన్న ఇళ్ల నిర్మాణం కూడా మరోవైపు ఊపందుకోనుంది. నిన్నమొన్నటి వరకూ స్థబ్దుగా సాగిన ఈ ఇళ్ల నిర్మాణం వేగం పుంజుకుంటుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో స్టీల్‌ ధరలు తగ్గిన నేపథ్యంలో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే, సిమెంట్‌ ధరలు కూడా తగ్గుతాయేమోనని కూడా మరికొందరు వేచి చూస్తున్నారు. ఈనేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి.

ఇసుక, కంకర, ఇటుక, సిమెంటు, స్టీలు, సెంట్రింగ్‌, టాపీ మేస్త్రులు, కార్మికులు, మిల్లర్ల యజమానులు, వైబ్రేటర్‌ నిర్వాహకులు ఇలా చెప్పుకుంటూ పోతే పలు రంగాలకు చెందిన వారికి ఉపాధి దొరుకుతోంది. ఇదిలా ఉండగా నిన్నమొన్నటి వరకూ నిలచిపోయిన భవన నిర్మాణ రంగం కూడా ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు బహుళ అంతస్థుల భవనాల నిర్మాణాల్లో వేగం పెంచుతున్నారు. వీరు కూడా ఇసుక సరఫరాను మరింత సరళతరం చేస్తే తమద్వారా పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశముందని చెబుతున్నారు. కాగా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా అందరి జీవితాలను తలకిందులు చేసింది.

దాని కారణంగా పెరిగిన ద్రవ్యోల్బణం సామాన్యులతో పాటు వ్యాపారవేత్తలను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా తర్వాత పుంజుకుంటున్న రియల్టీ రంగానికి ఇది పెద్ద దెబ్బగా మారింది. అయితే, గడచిన నాలుగు నెలలుగా నిర్మాణాలకు అవసరమైన ఉక్కు ధరలు టన్నుకు రూ.20 వేలు తగ్గాయి. ద్రవ్యోల్పనాన్ని కొంతమేర కట్టడిచేసే చర్యలు సత్‌ ఫలితాలనిచ్చాయని ప్రచారం మొదలైంది. నిపుణులు నాలుగైదు నెలల కిందట టన్ను ఉక్కు రూ.60 వేల స్థాయికి చేరుకుంటుందని వేసిన అంచనాలు నిజం అయ్యాయి. మార్చి నెలలో టన్ను ధర ఆల్‌ టైమ్‌ గరిష్ఠమైన రూ.85 వేల దగ్గరగా చేరుకుంది. కానీ ఇప్పుడు దాదాపు రూ.20 వేలు తగ్గి రూ.65 వేలకు చేరింది. ఈ తగ్గుదల మరికొంత కాలం కొనసాగవచ్చని తెలుస్తోంది.

అసలు రేట్లు ఎందుకు తగ్గాయి..?

- Advertisement -

కేంద్ర ప్రభుత్వం ఉక్కు ఎగుమతులపై పన్నును పెంచింది. ఎగుమతి సుంకం ఉక్కు విదేశాలకు వెళ్లడం మరింత ఖరీదైనదిగా మారింది. ఇది కాకుండా కొన్ని ఉక్కు ఉత్పత్తిదారులు కూడా ఎగుమతులను తగ్గించారు. ఉక్కుకు డిమాండ్‌ తక్కువగా ఉండటం కూడా ధరలపై ప్రభావం చూపిందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. దీపావళి నాటికి నిర్మాణ రంగంతో పాటు ఇతర రంగాల నుంచి డిమాండ్‌ పుంజుకుని స్టీల్‌కు డిమాండ్‌ పెరుగుతుందని స్టీల్‌ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. డిమాండ్‌ తగ్గటంతో పాటు ముడిసరుకుల ధరలు పెరగటం వల్ల కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయని చెబుతున్నారు. మరికొద్ది నెలల వరకు ఉక్కు ధరల్లో ఎలాంటి తగ్గింపు ఉండదన్న అభిప్రాయాన్ని వారు వెలిబుచ్చుతున్నారు.

తగ్గిన ఎగుమతులు..

కేంద్ర ప్రభుత్వం ఎగుమతి సుంకాన్ని పెంచడం వల్ల భారత వాటా తగ్గింది. చాలా మంది పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తిని తగ్గించుకున్నారు. ఎగుమతులు తగ్గిన నేపథ్యంలో ఇక్కడ ధరలు తగ్గినట్లు కూడా ప్రచారం సాగుతోంది. కాగా, కేంద్రం నుంచి ఎగుమతి సుంకం తగ్గింపు ప్రకటన వస్తుందని వారు భావిస్తున్నారు. దీపావళి తర్వాత ఉక్కు పరిశ్రమకు మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement