Thursday, April 25, 2024

ఉగాదికి సింహగిరి ముస్తాబు.. పంచాంగ శ్రవణం, పెల్లిరాట ఉత్సవం

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో : దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఉగాది పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నేపధ్యంలోనే ఉగాది పర్వదినానికి సంబంధించి సింహగిరిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని సింహాద్రినాధుడి ఆలయాన్ని అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దనున్నారు. ఉగాది పర్వదినాన సిరిలొలికించే సింహాద్రినాధుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను సర్వాభరణాలుతో అందంగా అలంకరిస్తారు. అదేరోజు స్వామిని పెళ్లికొడుకుగా అలంకరిస్తారు. ఆలయ ఆస్థాన మండపంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. స్వామి కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తరద్వారం, రాజగోపురం, కల్యాణ వేదిక వద్ద వైభవంగా పెల్లిరాటలు వేస్తారు.

- Advertisement -

అనంతరం పండితసత్కారంతో పాటు దాతలను ఘనంగా సన్మానిస్తారు. అదే రోజు సింహాద్రినాధుడి పాదాలను సూర్యకిరణాలు నేరుగా తాకుతాయి. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంటుంది. సూర్యకిరణాలు స్వామి పాదాలను తాకే సమయంలో భక్తులంతా హరినామ స్మరణతో పులకరిస్తారు. ఉగాది రోజు నుంచే స్వామి పెల్లి పనులు ప్రారంభిస్తారు. ఆ రోజు నుంచి ముఖ్యమైన వారందరికి స్వామి వివాహ ఆహ్వాన పత్రికలు అందజేయడం, పసుపు దంచడంతో పాటు కల్యాణానికి అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేస్తారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 2న సింహాద్రినాధుడి కల్యాణ మహోత్సవం జరగనుండగా అదే నెల 23న స్వామి నిజరూపదర్శనం (చందనోత్సవం)లో భక్తులకు సాక్షాత్కరించనున్నారు. ఆలయ ఇవో వి.త్రినాధరావు ఆధ్వర్యంలో ఇప్పటికే సంబంధిత అధికారులు ఉగాది, కల్యాణ మహోత్సవం, చందనోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు.

ఆలయ ఏఈఓ నరసింహరాజు పర్యవేక్షణలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ శ్రీనివాసరాజు, రాంబాబు తదితరులంతా భక్తులకు అవసరమైన సదుపాయాల కల్పనలో నిమగ్నమయ్యారు. కల్యాణ మహోత్సవానికి, చందనోత్సవానికి సంబంధించిన ఏర్పాట్ల కోసం సుమారు రూ.4 కోట్ల వరకు ధర్మకర్తల మండలి నిధ ులు మంజూరు చేసింది. పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు తగిన అనుమతులు ఇవ్వడం జరిగింది. దీంతో సింహగిరిపై స్వామి పెల్లిపనులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చందనోత్సవానికి సంబంధించి సోమవారం మద్యాహ్నం అమరావతిలో దేవాదాయశాఖామంత్రి కొట్టు సత్యనారాయణ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇదే సమయంలో అప్పన్న భూ సమస్యపై నియమించిన కమిటీ కూడా ప్రత్యేకంగా సమావేశం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement