Monday, March 25, 2024

Follow up | రిలీజ్ అయిన ఎస్‌ఐ రాత పరీక్షా ఫలితాలు.. కేవలం 38 శాతమే ఉతీర్ణత

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర పోలీసుశాఖలో ఎస్‌ఐ ఉద్యోగాలకు రాత పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. పరీక్షకు హాజరైన వారిలో కేవలం 38 శాతం అభ్యర్ధులు మాత్రమే అర్హత సాధించారు. పోలీసుశాఖలో 6511 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. వీటిలో 411 సివిల్‌, ఏపీఎస్‌పీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ఈ నెల 19వ తేదీన ప్రాధమిక రాత పరీక్ష జరిగింది. ఏపీ స్టేట్‌ లెవల్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఈ పరీక్షా ఫలితాలను మంగళవారం ప్రకటించింది. ఈమేరకు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు బోర్డు చైర్మన్‌ మనీష్‌కుమార్‌ సిన్హా తెలిపారు. కాగా ఎస్‌ఐ పోస్టుల రాత పరీక్షకు 1,51,288 మంది అభ్యర్థులు హాజరు కాగా, 57,923 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. వీరిలో పురుషులు 49,386 మంది ఉండగా.. 8,537 మంది మహిళా అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.

- Advertisement -

అర్హత మార్కులను ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు 30 శాతం, బీసీలకు 35, ఓసీలకు 40 శాతంగా నిర్ణయించారు. అభ్యర్థుల నుంచి 1,553 అభ్యంతరాలను స్వీకరించినట్లు- రిక్రూట్‌మెంట్‌బోర్డు తెలిపింది. అర్హత సాధించిన అభ్యర్థులు మార్చి 4వ తేదీ ఉదయం 11 గంటల వరకు ఓఎంఆర్‌ షీట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించింది. ఎస్‌ఐ రాత పరీక్ష ఉదయం, మధ్యాహ్నాం రెండు పేపర్లుగా నిర్వహించారు. ఈ రెండు పేపర్లలో అర్హత సాధించిన వారికే దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 211 కేంద్రాల్లో రాత పరీక్ష ప్రక్రియ నిర్వహించారు.

ఇదిలావుండగా 6511 పోలీసు ఉద్యోగాల భర్తీలో భాగంగా ముందుగా రిక్రూట్‌మెంట్‌ బోర్డు 6100 సివిల్‌, ఎపీఎస్‌పీ కానిస్టేబుల్‌ పోస్టులకు ఇప్పటికే రాత పరీక్ష నిర్వహించింది. దీనిలో అర్హత సాధించిన 95,209 మంది అభ్యర్ధులు అంటే 20.73 శాతం మంది మాత్రమే స్టేజ్‌ -2 ప్రక్రియకు సిద్ధమయ్యారు. స్టేజ్‌-2 ప్రక్రియలో భాగంగా జరిగే ఈవెంట్‌ల పరీక్ష కోసం ఈ నెల 13 నుంచి 20 వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది. మార్చి నెలలో వీరికి దేహదారుఢ్య పరీక్షల సమయంలోనే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కూడా ఉంటుందని బోర్డు తెలియచేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement