Friday, April 19, 2024

భీమసింగి షుగర్స్ మూసివేత త‌ప్ప‌దా..

విజయనగరం, ప్రభన్యూస్‌: జిల్లాలోని ‘భీమసింగి షుగర్స్‌’ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పాలకులు ప్రణాళికలు రచించారా? అన్న ప్రశ్న సర్వత్రా జనిస్తోంది. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం వేదికగా ఇటీవల ఇచ్చిన కన్ఫ్యూసింగ్‌ స్టేట్‌మెంట్లు కూడా పలు సందేహాలను రేకెత్తిస్తోన్న పరిస్థితి. ఆధునీకరణ పేరు చెప్పి గత ఏడాది క్రషింగ్‌ నిలిపేసిన ‘భీమసింగ్‌ షుగర్స్‌’లో ఆమేరకు ఎటువంటి ప్రయత్నం జరపకుండానే లక్ష టన్నుల చెరకు వుంటే ఈ ఏడాది క్రషింగ్‌ చేస్తామంటూ పేర్కొనడం పెద్ద ఎత్తున చర్చలకు తెరలేపింది. అధునీకరణ సంగతి పక్కన బెడితే ప్రతి యేటా సీజన్‌కు మూన్నెళ్ల ముందుగానే జరిగే యంత్రాల నిర్వహణ ప్రక్రియ జోలికి కూడా పోకుండానే లక్ష టన్నుల చెరకు వుంటే క్రషింగ్‌ చేస్తామన్నట్లు మాట్లాడిన బొత్స అందర్నీ విస్మయానికి గురి చేశారు.

అదే సమయంలో చెరకు సాగు గణనీయంగా తగ్గిపోవడం వల్లనే భీమసింగి షుగర్స్‌లో క్రషింగ్‌ అసాధ్యమంటూ మరోవైపు పేర్కొనడం పాలకుల అస్పష్ట విధానాలను ఎత్తి చూపినట్లయింది. నిజంగా సహకార రంగం పట్ల ప్రభుత్వ పెద్దలకు మమకారం వుంటే చెరకు విత్తే సమయంలోనే రైతులకు భరోసా ఇచ్చేలా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి వుండాలి. మేలు రకం వంగడాలను రాయితీ ధరపై అందించి చెరకు సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులను చైతన్య పరచి వుండేవారు కూడా.

లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ షుగర్స్‌ పరిధిలోని 80 వేల టన్నుల చెరకు, భీమసింగి షుగర్స్‌ పరిధిలోని 30వేలు టన్నుల చెరకు (మంత్రి బొత్స పేర్కొన్న లెక్కల ప్రకారమే).. వెరసి లక్ష టన్నులు దాటుతుందని, అటువంటప్పుడు భీమసింగి షుగర్స్‌లో క్రషింగ్‌ చేయాలి కదా? అన్నది రైతుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. సంకిలిలో ప్రయివేట్‌ ఫ్యాక్టరీకి పంపే బదులు భీమసింగి షుగర్స్‌లో క్రషింగ్‌ చేయడం వల్ల మళ్లి జీవం పోసే వెసులుబాటు వుంటుందన్నది వారి అంచనా. రవాణా ఖర్చులను సాకుగా చూపుతున్నారు తప్ప భీమసింగి షుగర్స్‌లో క్రషింగ్‌ చేస్తే వచ్చే లాభంలో కొద్ది మొత్తం పోవచ్చేమో గానీ పాలకులు చెబుతున్నట్లు అదనంగా రైతులకు వచ్చే నష్టమేమీ లేదని నిపుణులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఆ దిశగా సర్కార్‌ పెద్దలు పుపరాలోచన చేయాలని పలువురు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement