Sunday, November 10, 2024

AP | డిప్యూటీ సీఎం పవన్ తో షాయాజీ షిండే భేటీ

అమరావతి, ఆంధ్రప్రభ: ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్క కూడా భక్తులకు ఇస్తే పచ్చదనాన్ని పెంపొందించవచ్చ‌నే షాయాజీ షిండే సూచనను స్వాగతిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలలో అమలు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తానని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం పవన్‌ కళ్యాణ్‌ తో ప్రముఖ నటుడు షాయాజీ షిండే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన ఆలోచనలు పంచుకున్నారు. ఈ విధంగా వృక్ష ప్రసాద్‌ యోజనను మహారాష్ట్రలో మూడు ప్రముఖ ఆలయాల్లో అమలు చేస్తున్నారని షిండే తెలిపారు.

ఈ సందర్భంగా మొక్కలు, వాటి విశిష్టత గురించి మరాఠీలో రాసుకున్న కవితను పవన్‌ కళ్యాణ్‌కి చదివి వినిపించారు. ఆ ఆ మరాఠీ కవితను పవన్‌ కల్యాణ్‌ ప్రశంసిస్తూ అనువదించి చెప్పడం విశేషమన్నారు. ఈ సందర్భంగా షాయాజీ షిండే మాట్లాడుతూ..

”మనిషి మనుగడ ప్రకృతితో ముడిపడి ఉందని, ప్రపంచంలో ఏ మత ధర్మం అయినా ప్రకృతిని సంరక్షించుకుంటేనే భవిష్యత్తు అని బోధిస్తున్నాయని అన్నారు. భావి తరాలకు సుందరమైన పర్యావరణం అందించాలంటే చిన్ననాటి నుంచే నేటి తరానికి మొక్కల విశిష్టతను తెలపాల్సిన అవసరం ఉందన్నారు. దీని కోసం ఆలయాలకు పూజల నిమిత్తం వచ్చే భక్తులకు ప్రసాదంతోపాటు మొక్కలను అందించి వాటిని పెంచేలా ప్రోత్సహించాలని చెప్పారు. మహారాష్ట్రలో సిద్ధి వినాయక ఆలయం, దగదుశేథ్‌ గణపతి ఆలయం, మహాలక్ష్మి ఆలయాల్లో వృక్ష ప్రసాద్‌ యోజన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లారు. తన తల్లి కన్ను మూసినప్పుడు ఆమె బరువుకు సరితూగే విత్తనాలను చాలా ప్రాంతాల్లో నాటానని పవన్‌కు తెలిపారు. ఆధ్యాత్మికతకు పర్యావరణ శక్తి కలిస్తే భావి తరాలకు మేలు కలుగుతుంది అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement