Friday, April 19, 2024

దారి తప్పుతున్న ప్రగతి రథం! కాలం చెల్లిన బస్సులతోనే ఆర్టీసీ కాలయాపన

పల్లె వెలుగు అనగానే ఓ అనుబంధం..ఓ ఆత్మీయత..అది మన ఇంటి వాహనమన్నంత ప్రేమ..ఊరికి బస్సు వచ్చిందంటే ఆదో ఆనందం! ఆర్టీసీ బస్సంటే అంత అభిమానం మరి! అందులో ప్రయాణిస్తే హాయిగా ఉంటుందనే నమ్మకం..ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం..సుఖమయం అని బస్సు పై నినాదం నిజమేన్న విశ్వాసం..మరి..వాస్తవ పరిస్థితి అలాగే ఉందా..? ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితమేనా..? అంటే కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి. జిల్లాలో ఆర్టీసీ బస్సుల పరిస్థితి చూస్తుంటే ఆ బస్సెక్కాలంటే కొంచెం ఆందోళన చెందాల్సిన దుస్థితి. బస్సులకు బ్రేక్‌లు ఫెయిల్‌ అవుతూ..వరుస ప్రమాదాలతో ప్రగతి రథాలు దారితప్పుతూ.. ప్రయాణీకుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి.

కొత్తబస్సులేవి..?
కొత్త బస్సులు కొనుగోలు చేసే పరిస్థితిలో ఆర్టీసీ సంస్థ లేదు. ప్రయాణీకులకు సరిపడా బస్సులు నడిపేందుకు అద్దె బస్సులు వినియోగిస్తున్నారు తప్ప.. కొత్త బస్సులు కొనడం లేదు. పెరుగుతున్న ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా బస్సులు లేకపోవడంతో.., కాలం చెల్లిన బస్సులనే వినియోగిస్తున్నారు. ఈ బస్సులు మరీ అధ్వాన్నంగా ఉంటున్నాయి. పైన చూడటానికి అందంగా ఉండే విధంగా రంగులు వేసి రోడ్డెక్కిస్తున్నారు. రోడ్డు ఎక్కిన బస్సు గమ్యస్థానాలకు చేరేంత వరకు కూడా నమ్మకం లేని పరిస్థితి. బ్రేక్‌లు ఫెయిల్‌ కావడం, స్టీరింగ్‌లు స్ట్రక్‌ అవడం, కిటికీలు లేకపోవడం, డోర్లు సరిగా పడకపోవడం వంటి సమస్యలతో పల్లె వెలుగు బస్సులు రోడ్డు ఎక్కుతున్నాయి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు ఆ తరువాత ఆ ఊసే పట్టించుకోవడం లేదు.

మరో వైపు జిల్లాలో ప్రధాన దారులన్నీ దారుణంగా పాడయ్యాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎక్కడ చూసినా గుంతలే దర్శనమిస్తున్నాయి. దీంతో గుంతల రోడ్లల్లోనే బస్సులు తిరుగుతుండటంతో బ్రేక్‌లు ఫెయిలవ్వడం, గేర్లు పడకపోవడం, తదితర సమస్యలు ఎదురవుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమస్యతో ఒక బస్సు రోడ్డుమీద ఆగిపోతుందంటే ఇవే కారణాలు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజా రవాణాకు ఉపయోగించే బస్సులు పూర్తి ఫిట్‌గా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణీకులు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement