Saturday, April 20, 2024

రేపు సచివాలయ ఉద్యోగుల పెన్ డౌన్..

నెల్లూరు ప్ర‌భ‌న్యూస్ : రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు రేపు జిల్లాలో సచివాలయ ఉద్యోగులు పెన్ డౌన్ కు నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగులకు పీ ఆర్ సీ ప్రకటించింది అని.. ముఖ్యమంత్రి మానస పుత్రికలైన సచివాలయ సిబ్బందిగా పని చేస్తున్న తమ పట్ల శీతకన్ను చూపిస్తోందని వారు భావిస్తున్నారు. నిరసనలో భాగంగా వారు బయో మెట్రిక్ హాజరు వేయకూడదని.. పెన్ డౌన్ చేయాలని నిశ్చయించుకున్నట్లు‌ తెలుస్తోంది. ఇందులో‌ భాగంగా వారు కలెక్టరేట్ వద్ద.. జిల్లాలోని అన్నీ మండల కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టి వినతి పత్రాలు సంబంధిత అధికారులకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే జూన్ 30 కల్లా సచివాలయ ఉద్యోగుల స్కేల్ ఫిక్సేషన్ కు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన తరువాత కూడా సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగడం సరి కాదని సీనియర్ ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వ సర్వీసు అంటే అంత ఆషామాషీ కాదని.. చేరిన రెండు‌ సంవత్సరాలకే ఆందోళనలు చేపట్టడం వారి భవిస్యత్తుకు మంచిది కాదని సూచిస్తున్నారు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు రేపు ఓటీయస్ మెగామేళాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల ఆందోళన కార్యక్రమాలు ప్రాధాన్యత సంతరించుకోగా.. వీరి ఆందోళన వెనుక ప్రభుత్వ వ్యతిరేక యూనియన్లు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇటీవల జిల్లాలోని ఇందుకూరుపేట మండలం డేవిస్ పేటలో నిర్లక్ష్యం కారణంగా జిల్లా కలెక్టర్ సచివాలయం సిబ్బందిని సస్పెండ్ చేసినప్పుడు ఒక్క యూనియన్ కూడా తమకు సహకరించలేదని.. జిల్లా కలెక్టర్ మానవతా దృక్పథంతో ఎటువంటి చర్యలు తీసుకోకుండా.. హెచ్చరించి సస్పెన్షన్ రద్దు చేసారని కొందరు సచివాలయ ఉద్యోగులు గుర్తు చేసారు. కొందరు సచివాలయ ఉద్యోగులు తాము ఆందోళనలో పాల్గొనమని స్పష్టం చేసారు. కాగా ఆందోళనలపై.. పాల్గొన్నవారిపై తమకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ అధికారులకు ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement