Thursday, September 21, 2023

AP | స్క్రబ్‌ టైఫస్‌ కలకలం.. ఏపీలో కొత్త రకం వ్యాధి

ప్రభన్యూస్ : అసలే వర్షాకాలం. రోగాలు ప్రబలే సమయం. ముఖ్యంగా టైఫాయిడ్‌, మలేరియా, చికూన్‌గునియా తదితర జ్వరాలు జిల్లా ప్రజలనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గల ప్రజలను పట్టి పీడిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలనే కేరళలో కొత్తరకం వైరస్‌ వలన ఇప్పటివరకు మూడు మరణాలు సంభవించగా ఏపీలో తానేమి తక్కువ కాదనే రీతిలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తరకం జ్వరం కలకలం రేకెత్తిస్తోంది.

రెండు రోజులు క్రితం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం రూరల్‌ పరిధిలోని పోతుకుంట పంచాయతీలో మధు (20) అనే యువకుడు స్క్రబ్‌ టైఫస్‌ అనే జ్వరంతో మృతి చెందాడు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇదే మొదటి మరణమని జిల్లా వైద్యాధికారులు నిర్ధారించారు. విషయం తెలిసిన వెంటనే వైద్యాధికారులు అప్రమత్తమై పోతుకుంట పంచాయతీ పరిధిలో వైద్య బృందంతో వెళ్లి తక్షణ చర్యలు కింద పలు కార్యక్రమాలు చేపట్టారు.

- Advertisement -
   

ఇది మనుషుల నుంచి మనుషులకు రాదని, కీటకం కుట్టినప్పుడు ఆ కీటకంలోని బ్యాక్టీరియా ద్వారా మనిషికి సోకి తద్వారా స్క్రబ్‌ టైఫస్‌ జ్వరం వచ్చి శరీరంలోని అన్ని భాగాల పైన దీని ప్రభావం అధికమై మనిషి చనిపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. కీటకానికి సదురు బ్యాక్టీరియా ఎలుకల నుంచి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కీటకం కుడితే మరణమే…

స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి కీటకం కుడితే వస్తుందని, ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగే ఎలుకలలో ఈ బ్యాక్టీరియా అధికంగా ఉంటుందని, ఎలుకను కుట్టిన కీటకం, లేదా నల్లులకు బ్యాక్టీరియా సోకడం జరుగుతుంది. ఆ నల్లులు లేక కీటకం కుట్టినప్పుడు మనిషి శరీరంలోకి బ్యాక్టీరియా చేరి స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధికి గురికావడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ కీటకం మనిషిని కుట్టినప్పుడు ఆ ప్రదేశంలో నల్లగా మారి దద్దుర్లు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ముందుగా జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపించడం జరుగుతుందని చెబుతున్నారు. సుమారు వారం రోజులు పాటు జ్వరం ఉంటుందని, వెంటనే చికిత్స అందని పక్షంలో రోగి శరీరంలోని అవయవాలు ఒక్కొక్కటిగా దెబ్బతిని చనిపోయే ప్రమాదం ఏర్పడుతుందని వై ద్యులు వివరిస్తున్నారు. గత ఏడాది శ్రీకాకుళం జిల్లాలో కొన్ని కేసులు నమోదైనట్లు చెబుతున్నారు.

కానీ సకాలంలో వైద్యం అందించడం వలన వారంతా కూడా ఆసుపత్రిలో కోలుకోవడం జరిగిందని తెలిసింది. ధర్మవరం రూరల్‌ పరిధిలోని పోతుకుంట గ్రామంలో చోటు చేసుకున్న స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి మరణం కారణంగా అప్రమత్తమై తగిన నివారణ చర్యలు చేపట్టామని వైద్యాధికారులు తెలిపారు.

జిల్లా వైద్యాధికారి కృష్ణారెడ్డి వివరణ..

ధర్మవరం రూరల్‌ పరిధిలోని పోతుకుంట గ్రామంలో జరిగిన స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధితో మధు అనే యువకుడు మరణించిన సంఘటన దురదృష్టకరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. సంఘటన విషయం తెలియగానే తమ సిబ్బందితో సహా గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పూర్తిగా సమీక్షించడం జరిగిందన్నారు. ప్రధానంగా వ్యాధి సోకి మృతి చెందిన మధు కుటుంబ సభ్యులను కలిసి, వారి ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసు కోవడం జరిగింది. వారిలో ఒక మహిళకు జ్వరం వస్తున్న విషయాన్ని గుర్తించి, పలు పరీక్షలు నిర్వహించామని ప్రధానంగా డెంగ్యూ, టైఫాయిడ్‌, మలేరియా, పరీక్షలతో పాటు స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధికి సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించేందుకు రక్త నమూనాలను సంబంధిత ల్యాబ్‌ కు పంపించడం జరిగింది అన్నారు.

గ్రామంలో పరిశుభ్రత, దోమల నివారణకు కాలువలో మురికి నీరు తొలగింపు, పరిసరాలను చెత్తాచెదారం లేకుండా చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా గ్రామంలో పూర్తిస్థాయిలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ఒక వైద్యాధికారి పర్యవేక్షణ చేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. అంతేకా కుండా మృతుడు మధు అనే యువకుడు పెనుకొండ సమీపంలోని కియా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు-గా గుర్తించి ఫ్యాక్టరీలోని వైద్యుని కూడా సంప్రదించి స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధికి సంబంధించి నివారణ చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగిందన్నారు.

పోతుకుంటలో జరిగిన సంఘటనకు కూడా మూలకారణం ఏమిటనేది అన్వేషిస్తున్నామన్నారు. మరీ ముఖ్యంగా కీటకాల విషయంలో తగిన శ్రద్ధ పెట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పశువులు, జంతువులు వల్ల పిడుదులు, నల్లులు ఇతర కీటకాలు వల్ల ఈ వైరస్‌ వచ్చే ప్రమాదం ఉన్న కారణంగా ఆ దిశగా నివారణ చర్యలు తీసుకునేందుకు అన్ని సూచనలు, సలహాలు సైతం ఇవ్వడం జరుగుతోందన్నారు. సాధారణంగా శరీరంలో యాంటీ బయాటిక్‌ ఉంటుంది కాబట్టి, కొంతవరకు ఇబ్బంది ఉండదని, అలాగని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement