Friday, April 19, 2024

సంక్రాంతికి ఏపీలో – సీఎం కేసీఆర్ భారీ బ‌హిరంగ స‌భ‌

ఏపీలో భారీ బ‌హిరంగ స‌భ‌ని ఏర్పాటు చేయ‌నున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాత సంక్రాంతి ప‌ర్వ‌దినాన భారీ బ‌హిరంగ‌స‌భ‌ని ఏర్పాటు చేయ‌నున్నారు. ఏపీ రాష్ట్రానికి చెందిన పలువురు నేతలతో ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారు. కేసీఆర్ జాతీయ పార్టీకి మద్దతు తెలిపేందుకు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, తమిళనాడుకు చెందిన వీసీకే చీఫ్ తిరుమలవలన్ హైద్రాబాద్ కు వచ్చారు. ఈ ఏడాది డిసెంబర్ 9వ తేదీన ఢిల్లీ వేదికగా బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సభ ద్వారా ఉత్తరాదిన తమ పార్టీ వాణిని విన్పించనున్నారు కేసీఆర్. ఈ సభ ముగిసిన తర్వాత సంక్రాంతికి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంక్రాంతి పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు కూడా సంక్రాంతికి తమ స్వగ్రామాలకు వస్తారు. ఏపీలో సభ నిర్వహణకు ఇదే సరైన సమయమని టీఆర్ఎస్ చీఫ్ భావిస్తున్నారు. గుంటూరు, విజయవాడలలో ఏదో ఒక చోట బహిరంగ సభ ఏర్పాటు చేయాలనికేసీఆర్ భావిస్తున్నారు.గతంలో టీడీపీలో కీలకంగా పనిచేసి ప్రస్తుతం టీఆర్ఎస్ క్రియాశీలకంగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి నేతలు ఏపీకి చెందిన కొందరు నేతలతో టచ్ లోకి వెళ్లినట్టుగా సమాచారం.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న నేతలతో పాటు ఇతరులతో కూడా కేసీఆర్ టీమ్ చర్చలు జరుపుతుంది. ఏపీలోని ఇతర పార్టీల్లోని అసంతృప్తులతో కూడ టీఆర్ఎస్ ప్రతినిధులు టచ్ లోకి వెళ్లే అవకాశం ఉంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్నారు.దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ బలాన్ని పెంచుకోవాలని గులాబీ దళపతి వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఏపీలో కూడా తమ పార్టీని విస్తరించాలని తలపెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement