Monday, April 15, 2024

అంతర్వేదిని పర్యాటక ప్రాంతంగా మారుస్తాం: సజ్జల

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది సముద్ర తీర ప్రాంతంలో కోతకు గురౌతున్న ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, పార్టీ సీనియర్ నేత, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నల్లి డేవిడ్ రాజుతో కలిసి పరిశీలించారు. అంతర్వేది పర్యటనలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తీర ప్రాంతంలో సముద్ర కోత సమస్యను.. వైసీపీ నాయకులు డాక్టర్ నల్లి డేవిడ్ రాజు తీసుకువెళ్ళారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పర్యటించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. పూర్తి వివరాలను డేవిడ్ రాజును అడిగి తెలుసుకున్నారు. అంతర్వేది ప్రాంతంలో సముద్ర కోత నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సముద్రకోత సమస్య పరిష్కారానికి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని, రివిట్‌మెంట్ కట్టించాలని డేవిడ్ రాజు కోరారు. అదే విధంగా టూరిజం అభివృద్ధికి ఓ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని విజ్ణప్తి చేశారు. అయితే, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకు వెళ్ళి వీలైనంత త్వరలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని సజ్జల ఈ సందర్భంగా డేవిడ్ రాజుకు, అంతర్వేది ప్రజలకు హామీ ఇచ్చారు.

అదేవిధంగా, అంతర్వేది తీర ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయటానికి గల అవకాశాలను సైతం డేవిడ్ రాజు.. సజ్జల దృష్టికి తీసుకువెళ్ళారు. దీనికి సంబంధించి తగు చర్యలు తీసుకునేలా టూరిజం శాఖ అధికారులతో మాట్లాడతానని సజ్జల ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్ళుగా అంతర్వేది ప్రజలను వణికిస్తోన్న సముద్రకోత సమస్యకు సజ్జల పర్యటనతో అయినా పరిష్కారం లభిస్తుందని, ఈ ప్రాంతం ప్రముఖ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చెందాలని స్థానికులు ఆశిస్తున్నారు. తమ ప్రాంత సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళిన డాక్టర్ నల్లి డేవిడ్ రాజును ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement