Friday, March 29, 2024

బొత్స మరో ఈటల కానున్నారా ? కుట్ర చేస్తున్నారా?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రి బొత్స సత్యనారాయణ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి బొత్స సత్యనారాయణ బీజేపీలోకి వెళ్తున్నారు? ఢిల్లీలో మకాం వేసి మంతనాలు జరుపుతున్నారు? కాషాయ పెద్దలతో వరుస భేటీలు అవుతున్నారు?. ఇదీ గత రెండు, మూడు రోజులుగా పలు మీడియాలో వచ్చిన వార్తలు.

మంత్రి బొత్స ఇటీవల ఢిల్లీకి రహస్య పర్యటన చేశారని వైసీపీకి అనుకూలంగా ఏకపక్షంగా ఉండే ఓ చానల్‌తో పాటు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బొత్స ఢిల్లీ వెళ్లి అశోకా హోటల్‌లో ఉన్నారని.. అక్కడ కొంత మంది బీజేపీ పెద్దలతో రహస్య మంతనాలు జరిపారని వార్తలు వినిపించాయి. ఇందులో ఎంత నిజం ఉందో ఎవరికీ తెలియడం లేదు కానీ.. ఇలాంటి వార్తలు.. వైసీపీ అనుకూల మీడియాలో రావడంతో ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సాధారణంగా వైసీపీలో అంతర్గతంగా ఏదైనా జరిగితే వైసీపీ చెప్పే .. ఎల్లో మీడియాలోనే హైలెట్ అవుతుంది. కానీ ఇక్కడ భిన్నంగా వైసీపీలో బొత్స ఏదో చేస్తున్నారంటూ వైసీపీ అనుకూల మీడియా ఓ కథనాన్ని ప్రసారం చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. తెలంగాణలో ఈటల రాజేందర్ మంత్రిగా ఉండగానే.. ఆయనపై టీఆర్ఎ‌స్ అనుకూల మీడియా ఎలా అయితే రచ్చ చేసిందో.. బొత్స పై కూడా అలాగే చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బలమైన నేతగా ఉన్న బొత్సకు… పార్టీలో, ప్రభుత్వంలో ఎలాంటి స్వేచ్చ ఉండటం లేదు. ప్రెస్‌మీట్లు పెట్టమన్నప్పుడు పెట్టడం తప్ప చేయడానికి ఏమీ ఉండటం లేదట. ఆయన ప్రాధాన్యతను వ్యూహాత్మకంగా వైసీపీ పెద్దలు తగ్గించేస్తున్నారని తెలుస్తోంది. వైసీపీలో మొత్తం విజయసాయిరెడ్డిదే రాజ్యం. దీంతో బొత్స అసంతృప్తిగా ఉన్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బొత్సను మరింతగా బలహీనం చేసే ప్రక్రియలో… ఈ ప్రచారాన్ని వైసీపీ పెద్దలే చేస్తున్నారని వాదానలు వినిపిస్తున్నాయి. మంత్రిగా మాంచి హోదాలో ఉంటూ, స్వేచ్చ ఉన్నా లేకపోయినా అప్పుడప్పుడూ మీడియా ముందు మెరిపిస్తున్న బొత్స…ఓట్లు, సీట్లు కోసం తడుముకుంటున్న బీజేపీలోకి వెళ్తారంటే నమ్మశక్యమేనా? అన్నది కూడా ఆలోచించాలి.

మరోవైపు బొత్స బీజేపీలో వెళ్తున్నారనే వార్తలను పలువురు నాయకులు ఖండించారు. బొత్సది పూర్తిగా వ్యక్తిగత పర్యటన మాత్రమేనని అంటున్నారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లి రెండు రోజులు ఢిల్లీలోనే ఉన్నారని చెబుతున్నారు. దీంతో ఆయన బీజేపీలో చేరిపోతున్నారనే పుకారు వచ్చినట్లు స్పష్టం చేశారు. మొత్తం మీద బొత్స వ్యవహారం ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించిందనే చెప్పాలి.

- Advertisement -

ఇది కూడా చదవండి: ఆగిన గుండెకు ప్రాణం పోసిన కానిస్టేబుల్

Advertisement

తాజా వార్తలు

Advertisement