Thursday, April 18, 2024

Big Story: అమ్మో, ఆర్టీసీ కార్గో.. విలువైన వస్తువులు మాయం.. భయపడుతున్న వినియోగదారులు

అమరావతి, ఆంధ్రప్రభ: ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘కార్గో’పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. విలువైన వస్తువులు డెలివరీ కాకుండానే మాయమవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వస్తువులు డెలివరీ కాలేదంటని అడిగే వినియోగదారులకు సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెపుతున్నారు. సరుకు అక్కడే ఉన్నట్లు ‘ట్రాకింగ్‌’ చూపుతున్నా పార్సిల్‌ మాత్రం కనిపించడం లేదంటున్నారు. గట్టిగా అడిగితే మొక్కుబడి ఫిర్యాదు తీసుకొని పంపుతున్నారు. ఆ తర్వాత ఎన్నిసార్లు తిరిగినా..ఒకటే సమాధానం కనిపించడం లేదని. అదే తక్కువ విలువైన వస్తువులు అయితే ఎంతోకొంత పరిహారం అంటూ సర్ధుబాటు చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల నిర్వహణ..ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణ..పటిష్టమైన సెక్యూరిటీ ఉన్నప్పటికీ విలువైన వస్తువుల మాయం ఇప్పుడు మిస్టరీగా మారింది. ఓ పక్క కార్గో విస్తరణకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రణాళికలు వేస్తుంటే..మరో వైపు క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం కార్గో ప్రజలకు దూరం చేసే పరిస్థితికి దారితీస్తోంది.

అసలేం జరుగుతోంది..
గత డిసెంబర్‌లో అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ఓ వస్త్ర వ్యాపారి కృష్ణా జిల్లా కంకిపాడులోని మరో వస్త్రవ్యాపారికి రూ.1.20లక్షల విలువైన పట్టుచీరలు ఆర్టీసీ కార్గోలో విజయవాడకు పంపారు. మూడు రోజుల కిందట సరుకు పంపిన వ్యాపారి బకాయి కోసం ఫోన్‌ చేయడంతో పార్శిల్‌ డెలివరీ కాలేదనే విషయం బయటపడింది. సరుకు బుకింగ్‌ సమయంలో విజిటింగ్‌ కార్డులోని నంబర్లలో ఒకదానికి సరుకు వచ్చినట్లు మెసేజ్‌ వచ్చింది. అయితే వ్యాపారి సోదరుడు అందుబాటులో లేకపోవడంతో సమాచారం చేరలేదు. తీరా బకాయి అడగడంతో వెళ్లి వాకబ్‌ చేస్తే మెసేజ్‌ చూసి ఎందుకు రాలేదంటూ అక్కడున్న ప్రైవేటు సిబ్బంది దబాయించారు. సరే జరిగిన పొరబాటు మాదే అన్న వ్యాపారి పార్సిల్‌ తీసుకోవడంలో జాప్యానికి అదనపు నగదు చెల్లిస్తామంటూ చెప్పి ఇవ్వమన్నారు. మూడు రోజుల పాటు వెదికినా కనిపించలేదు. ట్రాకింగ్‌ మాత్రం సరుకు విజయవాడ బస్టాండ్‌ కార్గో గోదాములోనే ఉన్నట్లు చూపుతోంది. సరుకు మాత్రం కనిపించ లేదు. మరో వస్త్రవ్యాపారి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. కాకినాడ నుంచి విజయవాడలోని ఓ కార్యాలయానికి హోం ధియేటర్‌(సౌండ్‌ బాక్స్‌) ఆర్టీసీ కార్గోలో పంపారు. సరుకు చేరినట్లు మెసేజ్‌ వెళ్లిన మొబైల్‌ నంబర్‌ ఉద్యోగి సెలవులో ఉండటంతో పట్టించుకోలేదు. తీరా ఇప్పుడు కాకినాడ డీలర్‌ సౌండ్‌ బాక్స్‌ బిల్లు అడగడంతో పార్సిల్‌ మాయం విషయం వెలుగు చూసింది.

కొద్ది రోజుల కిందట విజయవాడ ప్రాంతానికి చెందిన రైతులకు చెన్నై నుంచి మోటారు పంపుసెట్‌ ఆర్టీసీ కార్గోలో వచ్చింది. ఎల్‌ఆర్‌ రాసేటప్పుడు టాక్స్‌ ఎక్కువ పడుతుందనే ఆలోచనతో పెద్ద మొత్తం రేటు తగ్గించి చూపారు. అదికూడా మాయమైనట్లు చెపుతున్నారు. అదేమంటే ఎల్‌ఆర్‌లో పేర్కొన్న విలువ పరిహారంగా ఇస్తామని చెప్పడంతో కన్నీటి పర్యంతం కావడం రైతు వంతైంది. గతంలో ఆర్టీసీ కార్గోకు రోజుకు 15 నుంచి 20 ఫిర్యాదులు వచ్చేవి. కాల క్రమేణా తగ్గాల్సి ఉండగా ఇప్పుడు సగటున రోజుకు 50 వరకు ఇదే తరహా ఫిర్యాదులు వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు కార్గో నిర్వాహకులకు ఆర్టీసీ అంత పెద్ద యంత్రాంగం లేకున్నా పార్సిల్స్‌ డెలివరీలో పక్కాగా ఉంటున్నారు. సరుకు డెలివరీ పాయింట్‌కు రాగానే మొబైల్‌ సందేశంతో పాటు వ్యక్తిగతంగా ఫోన్‌ చేసి చెపుతారు. కేవలం ఒక మేనేజర్‌, కొంతమంది సిబ్బంది మాత్రమే ఉన్నా పకడ్బంధీగా వ్యవహరిస్తుంటే..పెద్ద ఎత్తున కమీషన్లు ఇచ్చి ప్రైవేటు వ్యక్తులను, పర్యవేక్షణకు ఎటీఎం(అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌), కొందరు ఆర్టీసీ ఉద్యోగులు..ఆపై నిరంతర పహారా కాసే ఆర్టీసీ విజిలెన్స్‌ సెక్యూరిటీ పహారా. ఇంత యంత్రాంగం ఉన్నప్పటికీ పార్శిల్స్‌ మాయం కావడం సందేహాలకు తావిస్తోంది. నిర్వహణ కోసం ప్రైవేటు వ్యక్తులకు కార్గో ఆదాయంలో 13శాతం వరకు చెల్లిస్తోంది. అయినా మొబైల్‌ సందేశంతోనే సరిపెట్టడం శోచనీయం. కనీసం పార్శిల్‌ వచ్చిందనే సమాచారం కూడా ఇవ్వడం లేదు. కొన్ని సార్లు మొబైల్‌ సందేశాలు కూడా రావడం లేదని చెపుతున్నారు.

ఆదాయ వనరుగా..
ఆర్టీసీని నష్టాల బారి నుంచి గట్టెక్కించేందుకు కార్గో సేవలను అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో పొరుగు రాష్ట్రాల కంటే కార్గో చార్జీలు ఏపీఎస్‌ ఆర్టీసీలో తక్కువన్నారు. పైగా భద్రత కూడా ఉంటుందనే భరోసా ఇచ్చారు. పైగా ఎంపిక చేసిన పట్టణాల్లో డోర్‌ డెలీవరీ కూడా చేస్తున్నామని ఆయన తెలిపారు. ఉన్నాధికారుల భరోసాతో పలువురు ఆర్టీసీ కార్గోవైపు మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటు సంస్థలతో పోల్చితే తక్కువ రేటు కావడంతో ఇటీవల ఆర్టీసీ కార్గోకి ఆదరణ బాగానే పెరిగింది. పైగా మారుమూల ప్రాంతాలకు సైతం ఆర్టీసీ విస్తరించడంతో త్వరితగతిన డెలివరీ అవుతుందని భావిస్తున్న వినియోగదారులు ఇబ్బందులకు లోనవుతున్నారు. మరోసారి ఆర్టీసీ కార్గో సేవలు అంటేనే బెంబేలెత్తుతున్నారు.

చట్టపరమైన చర్యలు..
తమ పార్సిల్‌ మాయంపై చట్టపరంగా ముందుకెళ్లనున్నట్లు కంకిపాడు వ్యాపారి స్వామి తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేశానని పేర్కొంటూ వారి స్పందనను బట్టి ముందుకెళతానన్నారు. ఆర్టీసీలో పార్సిల్స్‌ మాయం అవుతున్నట్లు తన దృష్టికి రాలేదని విజయవాడ జోన్‌ సీసీఎం కే.శ్రీనివాసరావు తెలిపారు. తగిన ఆధారాలతో తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని చెప్పారు. రోజువారీ వచ్చే ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement