Wednesday, April 24, 2024

సాగుదారులకే పంటనష్టం …

మండపేట : ఆరుగాలం కష్టపడి పనిచేసి పండించిన పంట చేతికి వస్తుందన్న తరుణంలో తుఫాను ప్రభావంతో ఎందుకూ పనికి రాకుండా పోయిందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పెద్దమనసు చేసుకుని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మండపేట బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట చేతికి అందుతున్న వేళ అధిక వర్షాలు, ఈదురు గాలుల వల్ల, వరి చేలు పూర్తిగా నేల అంటాయన్నారు. పంట నష్టపోయి దిక్కు తోచని స్థితిలో రైతన్న ఉంటే వరుస తుఫాను హెచ్చరికలు మూలిగేనక్కపై తాటికాయ పడ్డట్లు ఉందన్నారు.

పంటనష్టపోయిన రైతాంగానికి నష్ట పరిహారంతో పాటు, ఇన్పుట్ సబ్సిడీ అందించాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే పంటనష్టం అంచనావేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని సూచించారు. ఈ పరిహారం సాగు చేసే కౌలు రైతులకు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. ఈ అధిక వర్షాలకు చాలా ప్రాంతాల్లో వరి నీటిలో నాని మొలకలు రావడమే గాక పంట కుళ్లిపోవడం కూడా జరిగిందన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతును అన్నివిధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట గింజలు ఏ దశలో ఉన్నప్పటికీ రైతు భరోసా కేంద్రాలు కొనుగోలు చేసి రైతు ఖాతాలో సొమ్ములు జమ చేయాలని అన్నారు. ఎకరాకు రూ 25 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement