Tuesday, March 26, 2024

RIP – ప్రముఖ కథా రచయిత కేతు విశ్వనాథరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం – జ‌గ‌న్ సంతాపం

ఒంగోలు – ప్రముఖ సాహితీవేత్త, రచయిత కేతు విశ్వనాథరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ఒంగోలులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విశ్వనాథరెడ్డి కన్ను మూశారు. రెండు రోజుల క్రితం ఒంగోలులోని కుమార్తె ఇంటికి వచ్చిన విశ్వనాథరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 84 సంవ‌త్స‌రాలు.


కడపకు చెందిన కేతు విశ్వనాథరెడ్డి ప్రసిద్ధ సాహితీవేత్త, విద్యావేత్త, కథా రచయితగా గుర్తింపు పొందారు. ఆయన కథలతో వేసిన కథా సంపుటి.. ‘కేతు విశ్వనాథరెడ్డి కథలు’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. తెలుగు సాహిత్యంలో కురువృద్ధుడిగా పేరుగాంచిన కేతు విశ్వనాథరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ లోని వైఎస్ఆర్ జిల్లా కమలాపురం తాలూకా రంగశాయిపురంలో జూలై 10, 1939న జన్మించారు.
పాఠశాల స్థాయి నుంచే కేతు విశ్వనాధ రెడ్డికి సాహిత్యం ఆసక్తి కలిగిందని చెప్పేవారు. క్రమంలోనే పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు తాను పనిచేసిన ప్రతిచోట్ల అనేక పాఠ్య పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. పాఠ్య ప్రణాళికలను కూడా రూపొందించారు. తెలుగు వార్తాపత్రికలలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి పత్రిక సిబ్బందికి శిక్షణలు కూడా ఇచ్చారు.
కేతు విశ్వనాథరెడ్డి తొలి కథ ‘అనాది వాళ్లు’. ఈ కథను సవ్యసాచిలో 1963 లో ప్రచురించారు. వీటితో పాటు కొడవటి కంటి కుటుంబరావు సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించారు. విశాలాంధ్ర తెలుగు కథ సంపాదకమండలికి అధ్యక్షుడిగా కూడా కేతు విశ్వనాథరెడ్డి సుదీర్ఘ కాలం పనిచేశారు. అభ్యుదయ రచయితల సంఘం- అరసం అధ్యక్షుడుగా కూడా ఉన్నారు.
కాగా, ప్రముఖ కథా రచయిత కేతు విశ్వనాథరెడ్డి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆధునిక తెలుగు సాహితీ రంగానికి విశ్వనాథరెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సామాజిక సంస్కరణలను అవశ్యకతను చెబుతూ విశ్వనాథరెడ్డి రాసిన కథలు పలువురికి స్ఫూర్తిగా నిలిచాయని సీఎం అన్నారు. ఆయన సేవలను గుర్తించి 2021లో వైయస్ఆర్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డుతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని సత్కరించిన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. విశ్వనాథ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement