Thursday, November 7, 2024

Big Story | వచ్చే ఎనిమిదేళ్లలో లక్షకు పైగా ఉద్యోగుల పదవీ విరమణ.. భారీగా ఏర్పడనున్న ఖాళీలు

అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో కీలకంగా వ్యవహరించాల్సిన ఉద్యోగులు, అధికారులు రానున్న ఎనిమిది సంవత్సరాల్లో పెద్ద సంఖ్యలో పదవీ విరమణ చేయనున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సరైన నియామకాల ప్రక్రియ చేపట్టాలని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారిక లెక్కల ప్రకారమే లక్ష మందికి పైగా ఉద్యోగులు, అధికారులు 2031 నాటికి పదవీ విరమణ చేయనున్నారు. కొన్నేళ్లుగా సరైన నియామకాలు లేకపోవడం వల్ల భారీగా ఖాళీలు ఏర్పడుతున్నాయి. నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గ్రూప్‌-1 వరకు ఆశించిన స్థాయిలో నియామకాలు జరగడం లేదు. ఇప్పుడు కొన్ని నియామకాలు జరుగుతున్నప్పటికీ.. వాటికన్నా పదవీ విరమణ చేసే వారి సంఖ్య భారీగా ఉంటోంది. భవిష్యత్తులో ఇదే సమస్యగా మారనుంది.

తాజాగా తెలిసిన సమాచారం మేరకు 2031 నాటికి 1,17,355 మంది పదవీ విరమణ చేయనున్నారు. కాగా అప్పటి వరకు రూ.2,73,780 కోట్లు చెల్లించాల్సి వుంది. ఉద్యోగుల పదవీ విరమణ పరిమితి పెంచడం వల్ల 2022- 2023 సంవత్సరాల్లో పదవీ విరమణ చేసే వారు లేరు. అయినా ప్రభుత్వం 2022లో రూ. 17,205 కోట్లు పించన్‌ చెల్లించగా 2023లో రూ. 18,237 కోట్లు పెన్షన్‌ కింద చెల్లించాల్సి వుంది. 2024లో 13,643 మంది పదవీ విరమణ చేయనుండగా రూ. 24,520 కోట్లు, 2025లో 13,583 మందికి రూ. 26,479 కోట్లు, 2026లో 14,095 మందికి రూ. 27,795 కోట్లు, 2027లో 14,905 మందికి రూ. 25,321 కోట్లు చెల్లించాల్సి వుంది.

అలాగే 2028లో 14,734 మంది రిటైర్‌ కానుండగా రూ. 30,276 కోట్లు, 2029లో 14,620 మందికి రూ. 31,343కోట్లు, 2030లో 16,227మందికి రూ. 33,358 కోట్లు, 2031లో 15,548మంది పదవీ విరమణ చేయనుండగా రూ. 34,252కోట్లు ప్రభుత్వం చెల్లించవలసి వుంది. ఆ తరువాత 2024 నుంచి వరుసగా రిటైర్‌మెంట్‌ తీసుకునే ఉద్యోగులు పెరగనున్నారు. 2024లో 13,643 మంది పదవీయ విరమణ చేయనుండగా, అక్కడి నుంచి ప్రతియేటా వారి సంఖ్య పెరగనుంది. 2030 వరకు భారీగా పెరుగుతుండగా, 2031లో మాత్రం కొద్దిగా తగ్గనుంది. పదవీ విరమణ చేసే వారి సంఖ్య పెరిగే కొద్దీ వారికి చెల్లించాల్సిన పింఛను మొత్తం కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. 2024 నుంచి 2031 వరకు ఎనిమిదేళ్లలో ఏకంగా రూ. 2,73,780 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ఒక అంచనా. అత్యధికంగా 2031లో ఒక్క సంవత్సరమే రూ. 34,252 కోట్లు- పింఛనుదారులకు చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement