Thursday, April 25, 2024

కరోనాతో రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి.. ఆనందయ్య మందుపై సందేహాలు!

ఆనందయ్య మందు తీసుకున్న తర్వాత కోలుకుంటున్నట్లుగా చెప్పిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య కన్నుమూశారు. కరోనా కారణంగా గత రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందారు. ఆనందయ్య కరోనా మందుకు క్రేజీ తీసుకొచ్చింది రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్యే.. తనకు మందు బాగా పనిచేసిందని తెలియజేశారు. ఆయన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాదాపు మరణం అంచులకు వెళ్లి ఆనందయ్య మందుతో తిరిగి వచ్చానని కోటయ్య చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. ‘‘ఊపిరి అందడంలేదు. కొన ఊపిరితో ఉన్న.. ఇంకా రెండు నిముషాలు ఆగితే, ఆక్సిజన్ లేకపోతే చనిపోతా.. దీంతో వెంటనే మావాళ్లు వచ్చి వెంటనే కంటిలో మందు వేశారు. 10, 15 నిముషాల్లో కోలుకున్నానని, ఈ మందు చాలా అద్భుతం’’ అని గతంలో కోటయ్య తెలిపారు. అయితే తాజాగా ఆయన జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఆనందయ్య మందుపై కాస్త సందేహాలు వస్తున్నాయి.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే కరోనా మందు తీసుకున్న హెడ్ మాస్టర్ కోటయ్య ఆరోగ్యం కొద్ది రోజుల క్రితం మరోసారి క్షీణించింది. ఆనందయ్య మందుతో కోటయ్య ఆక్సిజన్ లెవల్స్ పెరిగాయని ప్రచారం జరిగింది. అయితే, అనంతరం కోటయ్య ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన చికిత్స పొందుతూ చనిపోవడంతో ఆనందయ్య మందుపై సందేహాలు నెలకన్నాయి.

మరోవైపు ఆనందయ్య పంపిణీ చేస్తున్న కరోనా ఔషధంపై ఆయుష్ శాఖ నిపుణుల అధ్యయనం పూర్తి చేసింది. ఆయుష్ కమిషనర్ రాములు కృష్ణపట్నంలో పర్యటించి మందు తయారీలో వాడుతున్న పదార్థాలను పరిశీలించారు. ఆనందయ్య వినియోగిస్తున్న పదార్థాలు శాస్త్రీయంగానే ఉన్నాయని రాములు అభిప్రాయపడ్డారు. ల్యాబ్ నుంచి కూడా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని తెలిపారు. మందుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement