Thursday, September 21, 2023

తగ్గిన రిజిస్ట్రేషన్లు.. భూముల ధరతోపాటు నిర్మాణ రంగంలోనూ సవరణలు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఈనెల 1వ తేదీ నుండి ఎంపిక చేసిన ప్రాంతాల్లో భూముల ధరలు పెంచిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకునే వారి సంఖ్య తగ్గుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సగటున 8 వేల వరకూ రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉంటాయి. అయితే, మే 30, 31 తేదీల్లో సర్వర్‌లో నెలకొన్న సాంకేతిక లోపం కారణంగా అసలు రిజిస్ట్రేషన్లు జరగలేదు. ఇకఆస్తుల విలువ సవరణ చేపట్టిన జూన్‌ 1వ తేదీన కేవలం 5,700కు పరిమితమవ్వగా జూన్‌ 2వ తేదీ నకూడా అంతకు మించి రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరగలేదు. ఈక్రమంలో మరో రెండుమూడు రజులపాటు ఈ పరిస్థితి ఉండే అవకాశముందని రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.

మొదటి వారం తరువాత యథావిధిగా రోజుకు 8 వేల వంతున రిజిస్ట్రేషన్లు నమోదయ్యే అవకాశముందని ఆశాఖకు చెందిన ఒక సీనియర్‌ అధికారి తెలిపారు. మార్కెట్‌ విలువకు, ప్రభుత్వ విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ సవరణ చేపట్టడం జరిగిందితప్ప మిగతా అన్ని ప్రాంతాల్లోనూ యథావిధిగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీనిని ప్రజలు గమనించాలని కోరారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కొన్నిచోట్ల ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తామేమీ వ్యతిరేకం కాదన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అక్కడ సబ్‌ రిజిస్ట్రార్‌ ఇష్టారీతిన 100 శాతం, ఆపైన రేట్లు పెంచుతు నిర్ణయం తీసుకున్నారని, ఇది తమకు భారంగా మారిందని వారు ఆరోపించారు.

- Advertisement -
   

దీనిపై స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖ స్పందించి స్థానికంగా సబ్‌ రిజిస్ట్రార్‌ తీసుకుంటున్న నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా కిందిస్థాయి అధికారులు ఇష్టారీతిన ధరలు పెంచి రిజిస్ట్రేషన్లు చేసే వీలుండదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏదిఏమైనప్పటికీ భూముల ధరలను పెంచిన నేపథ్యంలో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. నిర్మాణ విలువల్లోనూ సవరణ ముఖ్యంగా, రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 1వ తేదీ నుండి పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలలో భూముల మార్కెట్‌ విలువల ప్రత్యేక సవరణను చేపట్టడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ విలువల సవరణను కూడా చేపట్టింది.

బహిరంగ మార్కెట్‌ విలువలు మరియు ప్రభుత్వ విలువల మధ్య భారీ అంతరం ఉన్న ప్రాంతాల్లో మార్కెట్‌ విలువల ప్రత్యేక సవరణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈక్రమంలోనే రాష్ట్రంలో నిర్మాణ విలువలను సవరించింది. ప్రాంతాలు మరియు నిర్మాణాల మార్కెట్‌ విలువలను ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో సంవత్సరానికి ఒకసారి మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రెండేళ్లకు ఒకసారి ఆగస్టులో సవరిస్తుంది. ఈ ఏడాది జూన్‌లోనే మార్కెట్‌ విలువల ప్రత్యేక సవరణను ప్రారంభించింది. జూన్‌ 1 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక సవరణ గురించి ప్రకటన వెలువడడంతో ప్రజలు తాము కొనుగోలు చేసిన ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు గత కొద్ది రోజులుగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద బారులు తీరారు.

నిర్మాణాలకు సరవణలు ఇలా

మునిసిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీ ప్రాంతాల్లో ఉన్న నిర్మాణాల మార్కెట్‌ విలువను సవరించడం జరిగింది. అపార్ట్‌మెంట్ల విలువ చదరపు అడుగుకు రూ.1,280 నుండి రూ.1,400కి సవరించబడింది. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల పరిధిలోకి వచ్చే నగర పంచాయతీల్లో ఈ రేటును రూ.1,200కి సవరించారు. ఇక గ్రామ పంచాయతీలలో ఈసవరించిన రేటు చదరపు అడుగుకు రూ.850 చేశారు. అలాగే కమర్షియల్‌ నిర్మాణాల విషయంలోనూ అదే విధంగా మునిసిపల్‌ ప్రాంతాల్లో రూ.1,700, నగర పంచాయతీలలో రూ.1,450 మరియు గ్రామ పంచాయతీలలో రూ.1,000 వంతున చదరపు అడుగుకు రేటు సవరించబడింది. అయితే, ఈ పెరిగిన భారమంతా కొనుగోలు దారులే భరించనుండటంతో నిర్మాణ రంగంలో ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల వ్యాపారులు తమకేమీ ఇబ్బంది లేదంటున్నారు. నిర్మాణ రంగం మందకొడిగా సాగుతున్న ఈ పరిస్థితుల్లో ఈ సవరణ తమకు ఇబ్బంది కలిగించే విషయమే అయినప్పటికీ పెరిగిన భారం కొనుగోలుదారులే భరించాల్సి ఉన్నందున తమ వ్యాపారాలకు నష్టమేమీ రాదని, అయితే మరింత మందకొడిగా మాత్రమే సాగుతాయని వారు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement