Friday, April 26, 2024

నాలుగు రిజర్వాయర్ల నిర్మాణానికి శ్రీకారం.. ఆటంకంగా మారిన భూసేకరణ

కర్నూలు, ప్రభన్యూస్ : జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి కీలకమైన ఆర్‌డిఎస్‌ కుడికాల్వ తవ్వకం పనులు నత్తనడకన జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించి రెండేళ్ల కిందట రూ.1985 కోట్లతో టెండర్‌ పిలిచారు. సెప్టెంబర్‌ 2023 నాటికి పూర్తిచేయాలని 1,350 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం 41 కిలోమీటర్లు మాత్రమే సర్వే చేశారు. తుంగభద్రపై బొమ్మలసత్రాపురం వద్ద రాజోలి బండ ఆనకట్ట ఉంది. అక్కడి నుండి కర్నూలు శివారులోని ఉల్చాల వరకు 160 కిలోమీటర్ల మేర త్రవ్వకాలను నిర్ణయించారు. నిత్యం 3వేల క్యూసెక్యులు, 63 రోజుల పాటు నీటిని తరలించేలా ప్రణాళికలు ప్రత్యేకంగా రూపొందించారు. ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని 40వేల ఎకరాలకు సాగునీరు, 350 గ్రామాల తాగునీటి అవసరాలు తీరనుంది. కాల్వ పరిధిలో మరో 12,500 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. బొమ్మలసత్రాపురం నుండి ఉల్చాల వరకు 160 కిలోమీటర్ల మేర త్రవ్వే కాల్వ పరిధిలో నాలుగు రిజర్వాయర్లను నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించారు. కోసిగి వద్ద 320 ఎకరాల్లో 0.5 టీఎంసిలు, పెద్దకడబూరు వద్ద 700 ఎకరాల్లో 0.50 టీఎంసీలు, కోటేకల్‌ వద్ద 600 ఎకరాల్లో 1.5 టీఎంసీలు, చిన్నమర్రివీడు వద్ద 600 ఎకరాల్లో 0.25 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు ఏర్పాటుచేయాల్సి ఉంది. మంత్రాలయం, నందవరం ప్రాంత రైతులు భూసేకరణ చేయాలని పట్టుపడుతున్నారు.

ఈ ప్రాజెక్టు పనులు 2023 నాటికి పూర్తికావాల్సి ఉండగా ఇప్పటివరకు 41 కిలోమీటర్లు మాత్రమే సర్వే పూర్తిచేశారు. పైపులైన్‌ నిర్మాణపనులు 7.7 కిలోమీటర్లు మాత్రమే జరిగాయి. భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తిచేస్తే తప్పా గడువులోగా పనులు పూర్తికానున్నాయి. ఇప్పటికైనా పశ్చిమ ప్రాంత ఆర్‌డిఎస్‌ కుడికాల్వ పనులు వేగంగా పూర్తిచేయడానికి అధికారులు కృషిచేయాలని అన్నదాతలు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement