Thursday, March 28, 2024

రావణ సంతతి చంద్రబాబు అండ్ కో.. జలవనరుల మంత్రి అంబటి ధ్వజం

అమరావతి, ఆంధ్రప్రభ: త్రేతాయుగంలో రావణాసురుడు సంతతి లంకలో పుట్టారు. కలియుగంలో రావణాసురుడి సంతతి చంద్రబాబు అండ్‌ కో రూపంలో ఆంధ్రప్రదేశ్‌లో పుట్టారని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత మూడు రోజులుగా చంద్రబాబు నాయుడు కర్నూలు, వైఎస్‌ఆర్‌ కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటిస్తూ పిచ్చిపట్టినట్టుగా మాట్లాడుతున్నాడన్నారు. టీడీపీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని అవకాశం దొరికితే భారతదేశాన్ని సర్వనాశనం చేయగల వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. రాయలసీమలో పర్యటిస్తూ.. ఇంతటి అపూర్వ స్వాగతం ఎక్కడా లభించలేదని తనకుతాను చంద్రబాబు డబ్బా కొట్టుకుంటున్నాడని, 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని అంబటి డిమాండ్‌ చేశారు.
టీ జీ వెంకటేష్‌కు రాజ్యసభ టిక్కెట్‌ ఇచ్చారో, అమ్ముకున్నారో చంద్రబాబు చెప్పాలన్నారు.

పొరుగు రాష్ట్రం గురించి మాట్లాడే చంద్రబాబు తన హయాంలో సురేష్‌ ప్రభు, నిర్మలా సీతారామన్‌కు ఎలా టిక్కెట్‌ ఇచ్చారని ప్రశ్నించారు. సుజనాచౌదరి, సీఎం రమేష్‌లు డబ్బు సంచులు మోశారు అనే కదా వాళ్ళకు టిక్కెట్లు ఇచ్చింది అని అంబటి నిలదీశారు. ఆర్‌.కృష్ణయ్యను బీసీ జాతీయ నాయకుడిగా గుర్తించి సీఎం జగన్‌ రాజ్యసభ టిక్కెట్‌ ఇచ్చారన్నారు. చంద్రబాబులా టిక్కెట్లు అమ్ముకొనే సంస్కృతి జగన్‌కు లేదన్నారు. కర్నూలులో న్యాయ రాజధాని రాకుండా అడ్డుపడుతున్న గుంటనక్క చంద్రబాబు నైజనం ఆ ప్రాంత ప్రజలు తెలుసుకోగలరన్నారు. పులివెందుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రాజెక్టులు అన్నీ ఒక్కరోజుతో పూర్తి అయ్యేవి కావని మంత్రి అంబటి పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌లను ప్రాధాన్యతాక్రమంలో పూర్తి చేస్తామని, త్వరలో సంగం, నెల్లూరు బ్యారేజీలు సీఎం చేతుల మీద ప్రారంభం అవుతాయని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement