Friday, June 25, 2021

హైదరాబాద్ కు RRR.. సీఎస్‌కు రఘురామ భార్య ఫోన్‌!

నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహరంలో పలు ఆసక్తికరమైన మలుపులు, ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌కు ఎంపీ రఘురామకృష్ణ రాజు భార్య రమాదేవి ఫోన్ చేశారు. తన భర్తకు జైలులో ప్రాణహాని ఉందని, సుప్రీంకోర్టు తీర్పు సీఐడీకి వ్యతిరేకంగా రావడంతో.. కక్ష పెంచుకునే అవకాశం ఉందని తెలిపారు. తక్షణమే రఘురామను ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో వెంటనే స్పందించిన సీఎస్.. గంటలోనే ఎస్కార్ట్ ఏర్పాటు చేసి పంపుతామని చెప్పారు. అప్పటి వరకు జాప్యం చేసే ధోరణిలో కనిపించిన ప్రభుత్వ వర్గాలు రఘురామను హైదరాబాద్ తరలించారు.

రఘురామకు పోలీస్‌ ఎస్కార్ట్‌తో పాటు సీఆర్పీఎఫ్‌ రక్షణ కల్పించారు. రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రికి రఘురామ చేరుకోనున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. జ్యుడీషియల్‌ ఆఫీసర్‌ను తెలంగాణ హైకోర్టు నియమించింది. రఘురామ ఆర్మీ ఆస్పత్రికి చేరుకునే సమయానికి.. జ్యుడీషియల్‌ ఆఫీసర్‌ను అక్కడికి పంపే అవకాశం ఉంది.

కాగా, రఘురామ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలివ్వడం పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఇప్పటికే రఘురామకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామ రాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. జ్యుడిషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని ధర్మాసనం ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Prabha News